మంత్రి సీదిరి అప్పలరాజు వర్సెస్ గౌతు శిరీష.. సెల్ఫీలతో రచ్చ!!
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు రాకముందే వాడివేడిగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శల వర్షం గుప్పించుకోవటమే కాకుండా అధికార, ప్రతిపక్ష నాయకుల సెల్ఫీలతో సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ తమ హయాంలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు.
చంద్రబాబు సైతం తమ హయాంలో చేసిన అభివృద్ధిని సెల్ఫీ ల ద్వారా చూపిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా తామేమీ తగ్గేది లేదని సెల్ఫీ వార్ మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలో నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు తమ పలాస నియోజకవర్గంలో కడుతున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు సెల్ఫీ తీసుకొని చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి మాస్కు ధరించి మంత్రి అప్పలరాజు ఫోటోలు దిగి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి చంద్రబాబును ప్రశ్నించారు. 200పడకల ఆసుపత్రితో కూడిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం తుది దశకు చేరుకుందని ఇలాంటి నిర్మాణం ఒకటైనా చేసావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఇక టిడ్కో ఇళ్లలో డొల్లతనాన్ని బయట పెడితే తిరిగి సమాధానం కూడా చెప్పలేక దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు పడ్డారని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు.
మంత్రి అప్పలరాజు కు కౌంటర్ ఇచ్చిన టిడిపి పలాస నియోజకవర్గ ఇన్చార్జి గౌతు శిరీష టిడ్కో ఇళ్ళముందు సెల్ఫీ దిగి అప్పలరాజు కు సవాల్ విసిరారు. టిడిపి హయాంలో 95 శాతం పనులు పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను నేటికీ మిగిలిన ఐదు శాతం నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదని గౌతు శిరీష ఆక్షేపించారు.
అసంపూర్తిగా ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు రంగులు వేసి, సెల్ఫీలు దిగి సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కనీసం దానిని ఎన్నికలలోపైనా పూర్తి చేస్తారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పలాసలో నేతల సెల్ఫీల సవాళ్ళ పర్వం ఆసక్తికరంగా సాగుతుంది.












Click it and Unblock the Notifications