హైస్కూల్ లవ్ స్టోరీ.. ఫ్రమ్ విజయవాడ టూ హైదరాబాద్.. ట్విస్టులు అదుర్స్ !!
పిల్లల భవిష్యత్తు బాగుండాలని కాయకష్టం చేసి మరి పిల్లలను చదివిస్తారు. కానీ కొంతమంది మాత్రం ఆ తెలిసీతెలియని వయసులో చేసే పిల్లవేషాలు ఒక్కోసారి హద్దు దాటి తిప్పలు తెస్తాయి. ఒక 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమ పేరుతో విజయవాడలోని ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. మహా నగరం అయిన హైదరాబాద్ వచ్చి ఏకంగా ఇల్లు అద్దెకు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. వినడానికి సినిమా స్టోరీ లాగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ హైస్కూల్ లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
అసలేం జరిగిందంటే..?
కృష్ణలంకకు చెందిన 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ఒకే పాఠశాలలో చదువుతున్నారు. కాగా బుధవారం ( నవంబర్ 26, 2025 ) బాలుడి పుట్టినరోజు కావడంతో స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. బాలిక కూడా ఉదయం 8:30 గంటలకు స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి బాలుడి ఇంటికి వచ్చినట్టు చెబుతున్నారు. ఆ సమయంలో బాలుడి తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో వారిద్దరూ కలిసి కేక్ కట్ చేసుకున్నారు. ఆ తర్వాత బాలుడు బాలికను ఇంట్లో ఉంచి.. స్కూల్‌కు వెళ్లి తన స్నేహితులకు చాక్లెట్లు పంచి తిరిగి వచ్చేశాడు. అనంతరం ఆ బాలిక తన ఇంటికి వెళ్లిపోయింది.

ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాలిక మళ్లీ స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి బాలుడి ఇంటికి వచ్చేసింది. అప్పుడే పెద్దయ్యాక కలిసి జీవించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలుడు తన తండ్రి ఫోన్‌తో పాటు ఇంట్లో నుంచి రూ.10 వేల నగదు తీసుకుని బాలికతో కలిసి హైదరాబాద్‌కు బస్సెక్కాడు. అయితే సాయంత్రం అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. బాలిక స్కూల్‌కు రాలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు.. స్కూల్ యూనిఫాంలో బాలుడితో కలిసి వెళ్తున్న బాలిక దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో బాలుడి తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించి విజయవాడకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
హైదరాబాద్‌లో అద్దె ఇల్లు కోసం..
మరోవైపు మైనర్లు ఇద్దరు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో రాత్రి 10 గంటల సమయంలో బస్సు దిగి ఆటోలో తుక్కుగూడకు చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ వారిని గమనించి తన ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకొని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటన పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. మైనర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ నిరంతరం అవసరమని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications