ఓట్లు: మిర్చి ఘాటు, డబ్బు పంచిన తెరాస అభ్యర్థి పిఏ
వరంగల్/: పోలింగ్ సిబ్బందికి మిర్చి ఘాటు తగిలింది. వరంగల్ జిల్లా ఏనుమాముల మిర్చి యార్డులో ఎన్నికల సామాగ్రిని ఉంచారు. బుధవారం ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. అయితే, మిర్చి ఘాటుకు వారికి తుమ్ములు, దగ్గులు వచ్చాయి.
మిర్చియార్డులో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంపై పోలింగ్ సిబ్బంది మండిపడుతున్నారు. పలువురు తుమ్ములను తట్టుకోలేక ముఖానికి కర్చీఫ్‌లు, చీర కొంగులు అడ్డం పెట్టుకుంటున్నారు. చాలామందికి మాస్కులు కూడా ఇవ్వడం గమనార్హం. మిర్చి ఘాటుకు మండే ఎండలు తోడయ్యాయి. దీంతో వారు తట్టుకోలేకపోయారు.

తెరాస అభ్యర్థి పిఏ అరెస్ట్
కుత్బుల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి హన్మంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఫణీందర్ రెడ్డి, గణేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి కూకట్‌పల్లి నిజాంపేటలో వారిద్దరూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో వారిని అరెస్టు చేసి, రూ.24వేల నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
దగ్గుబాటితో టిడిపి అభ్యర్థి భేటీ
దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో టిడిపి నేత సాంబశివ రావు చిత్తూరు జిల్లా తిరుపతిలో భేటీ అయ్యారు. సాంబశివరావు ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావుది కూడా అదే నియోజకవర్గం కావడంతో... రానున్న ఎన్నికల్లో తన గెలుపుకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.












Click it and Unblock the Notifications