చంద్రబాబు పర్యటనలో అపశృతి.. త్రుటిలో తప్పిన ప్రమాదం
చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని బూరుగుపూడివద్ద చంద్రబాబు కారును.. మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. అయితే, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇదేం కర్మ మన రాష్ట్రానికి..
చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' పేరుతో 3 రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు జరుగుతాయి. లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు ఇక నుంచి రెగ్యులర్‌గా ప్రజల్లో ఉండేందుకు రూట్ మ్యాప్ ను రూపొందించుకున్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన నేతలు
తొలి రోజు జగ్గంపేట.. రెండో రోజు జగ్గంపేట, పెద్దాపురం.. మూడో రోజు పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. మూడు రోజుల పాటు 145 కిలో మీటర్ల పొడవున రోడ్‌షో సాగనుంది. జగ్గంపేటలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. గోకవరంలో ఏర్పాట్లను జ్యోతుల నెహ్రూ.. వంతల రాజేశ్వరి పరిశీలించారు. గోకవరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానికులు పూలు చల్లుతూ స్వాగతం పలకవడంతోపాటు ప్రతి ప్రధాన సెంటర్లలో చంద్రబాబుకు క్రేన్ ద్వారా భారీ గజమాలలు వేసి అభిమానం చాటుకున్నారు.

ఎన్నికల సమయానికి అన్నీ పూర్తి?
ఎన్నికల సమయానికి అన్ని నియోజకవర్గాలు చుట్టిరావాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో 157 నియోజకవర్గాల సమీక్షను కూడా పూర్తిచేశారు. త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల సమీక్షలు కూడా పూర్తిచేయనున్నారు. జనసేనతో పొత్తుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో ఇక్కడి ప్రజల ఆలోచనలను అంచనావేసి ఆ ప్రకారం జనసేనకు టికెట్లు కేటాయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications