పవన్ క్షమాపణలు చెప్పాలి, చిరంజీవి తమ్ముడు కాకపోతే - ఎమ్మెల్యే అనిరుథ్..!!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కోనసీమకు దిష్టి తగిలిందని పవన్ చేసిన వ్యాఖ్యల పైన అనిరుథ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కు ఏపీ పై ప్రేమ ఉంటే తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోవాలని.. తెలంగాణలో ఆస్తులు ఎందుకు కొంటున్నారని నిలదీసారు. చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా అని ప్రశ్నించారు. పపన్ తాను చేసిన వ్యాఖ్యల పైన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
కాంగ్రెస్ అనిరుథ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ 15 ఏళ్ల తరువాత సీఎం అవుతానని అంటున్నారని.. 70 ఏళ్ల వయసులో సీఎం అయి చేసేదేముందని ప్రశ్నించారు. తాము చిరంజీవి, పవన్, బాలయ్య, ప్రభాస్, మహేశ్ లాంటి అందరి హీరోలను అభిమానిస్తామని చెప్పుకొచ్చారు. 2019లో పవన్ ఏపీలో ఎన్నికల్లో ఓడిపోయారని.. పవన్ ఒక్కరైనా గెలవాల్సిందని తాను కూడా బాధ పడ్డానని చెప్పారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుతో గెలిచి.. పదవి తెచ్చుకున్నారని.. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే సత్తా ఏంటో తెలిసేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల దిష్టి తగితి కోనసీమ ఆగమై పోయిందని పవన్ చెప్పటం సరికాదన్నారు. తెలంగాణ ఆస్తులు కావాలి.. మావి దిష్టి కళ్ల అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కోనసీమ పర్యటనలో భాగంగా రైతులతో పవన్ తాజాగా సమావేశం అయ్యారు. ఆ సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యల పైన ఇటీవల మాజీమంత్రి జగదీశ్ రెడ్డి.. తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఖండించారు. 'తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందనడం తప్పు. ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా దిష్టి తగిలితే పవన్ గెలిచేవారా? ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
కాగా ఇటీవల పవన్ రాష్ట్రం విడిపోవటానికి గోదావరి జిల్లాల పచ్చదనమూ కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశాల పైన గట్టిగా స్పందిస్తున్నారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యల పైన జగదీశ్ రెడ్డి స్పందించగా.. ఇప్పుడు అనిరుథ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీని పైన జనసేన ఏ రకంగా స్పందిస్తుందనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications