జగన్ మూర్ఖంగా: జ్యోతుల నెహ్రూ పార్టీని వీడడానికి కారణం ఇదే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. అజాత శత్రువుగా ఏపీ రాజకీయాల్లో ఎదిగిన జ్యోతుల నెహ్రూ తనకు వైసీపీలో జరిగిన అవమానంపై కార్యకర్తల ఎదుట వెళ్లగక్కారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని తన సొంతూరు ఇర్రిపాకలో ఆదివారం ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన అనుచరులు, కార్యకర్తల ముందు తన ఆక్రోశం, ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని వీడాలన్న నిర్ణయం వెనుక జరిగిన పరిణామాలను వివరించారు. ''పీఏసీ చైర్మన పదవిలో ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబుతో సూటిగా మాట్లాడాలని, ఆ పదవికి నేను సరిపోనని జగన్‌ అనడం బాధ కలిగించింది. మరి వైసీపీ శాసనసభాపక్ష ఉప నేతగా ఎలా సరిపోతాను? 59 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది నాకే పీఏసీ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. జగన్‌ మూర్ఖంగా మరొకరికి పదవి ఇవ్వడం దురదృష్టకరం'' అని నెహ్రూ కార్యకర్తల ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.

మరోవైపు ఇక తాను పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు రాగానే... ముందూ వెనుకా చూసుకోకుండా జిల్లా అధ్యక్ష పదవి, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవులను వేరొకరికి కేటాయించాలని పార్టీ నేతలు సాయిరెడ్డి, భాస్కరరెడ్డికి జగన్ సూచించారని... దీనిని అస్సలు తట్టుకోలేకపోయానని ఆయన పేర్కొన్నారు.

MLA Jyothula Nehru insulted in YSRCP

''ఇవన్నీ నన్ను కుంగదీశాయి. మనస్తాపంతోనే వైసీపీ వీడి... టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను'' అని ఆయన తన కార్యకర్తలకు చెప్పారు. జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి చేరితే తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ మరింత బలపడుతుంది. జ్యోతులు నెహ్రూ కాపు వర్గానికి చెందిన నేత కావడంతో పాటు విశ్వసనీయత ఉన్న నాయకుడు.

జ్యోతుల నెహ్రూకు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని పార్టీల కార్యకర్తలతోనూ మంచి సంబంధాలున్నాయి. ఈ క్రమంలో జ్యోతుల టీడీపీలో సర్దుకు పోవడం అసలు సమస్యే ఉండదని నేతలు, కార్యకర్తలు అంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

పిఠాపురం ఎమ్మెల్యే వర్మ వారిని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సుమారు గంటసేపు చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీలో చేరాలన్న ఆకాంక్షను నెహ్రూ, సుబ్బారావు వ్యక్తంచేశారు. యనమల వారిని అభినందించారు. జిల్లాలో అందరం కలిసి పనిచేద్దామని, తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

మీడియా కంటబడకుండా యనమల ఇంటి వెనుక వైపు ద్వారం గూండా లోపలికి వెళ్లిన జ్యోతుల, వరుపుల... అదే మార్గంలో బయటకు వచ్చారు. సామరస్య వాతావరణం నెలకొల్పాలని, ఎవరికీ ఇబ్బందులు రాకుండా కలసి పనిచేయాలని నిర్ణయించారు. భేటీ అనంతరం వర్మ విలేకరులతో మాట్లాడారు. టీడీపీలో వారి చేరికకు ముహూర్తం ఖరారు కాలేదని, తగిన సమయంలో తేదీ ప్రకటిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+