బాలయ్య వ్యాఖ్యల వివాదం వెనుక కుట్ర - రామానాయుడు..!!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. బాలయ్య వ్యాఖ్యలపై నిరసనల వెనుక వైసీపీ ఉందని టీడీపీ ఆరోపిస్తోంది.
నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల పైన అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య..అఖిల్ స్పందించారు. అక్కినేని అభిమానులు నిరసనలకు దిగారు. అదే వేడుకలో ఎస్వీ రంగారావు పైన బాలయ్య చేసిన వ్యాఖ్యలను కాపునాడు తప్పుబట్టింది. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మంత్రి రోజా ఈ వివాదం పైన స్పందించారు. బాలయ్య వ్యాఖ్యల పైన అక్కినేని నాగార్జున స్పందించాలని డిమాండ్ చేసారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన టీడీపీ స్పందించింది
బాలయ్య వ్యాఖ్యల పైన కొనసాగుతున్న వివాదం పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు. సినిమా వేదికగా చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా కుల రంగు పులిమే ప్రయత్నం సాగుతోందని ఆరోపించారు. అధికార వైసీపీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని ధ్వజమెత్తారు. ఎస్వీ రంగారావు పైన బాలయ్య వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. కమ్మ - కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. కాపుల మధ్య చీలిక తీసుకొచ్చేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న వైయస్ అవినాష్ వ్యవహారం డైవర్ట్ చేసేందుకు లేని వివాదాన్ని ప్రచారం చేస్తున్నారని రామానాయుడు మండిపడ్డారు.

గతంలో వివేకా హత్య గురించి ఢిల్లీలో వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేసిన సమయంలో అయ్యన్న ఇంటి పైన దాడులు చేయించారంటూ రామానాయుడు ఆరోపించారు. అప్పుడు కూడా డైవర్ట్ చేశారంటూ ఆయన నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. వివేకా కేసును సీబీఐ లోతుగా విచారణ చేస్తోందని రామానాయుడు అభిప్రాయపడ్డారు. అటు అక్కినేని అభిమానులు నెల్లూరులో నిరసనలకు దిగారు. రాజకీయంగానూ ఇప్పుడు ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంటోంది. మొత్తానికి నందమూరి బాలకృష్ణ సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు రాజకీయ రంగును పులిమి కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర మంచిదికాదని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎలాంటి టర్న్‌లు తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications