చిందులు.. ఆపై చితకబాదుడు.. బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ రచ్చ రచ్చ!
ఏర్పాట్లు సరిగ్గా లేని కారణంగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ రిసార్ట్స్ సిబ్బందిపై దాడికి యత్నించినట్టు సమాచారం.
గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ అభివృద్ది సంగతేమో గానీ.. ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు మాత్రం పెరిగిపోతున్నాయన్న వాదనలు చాలానే వినిపిస్తున్నాయి.
ఆమధ్య బెజవాడ కార్పోరేటర్.. విమానంలో ఓ స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించడం.., ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక ఎమ్మార్వో వనజాక్షితో వ్యవహరించిన తీరు.., ఇప్పటికీ ఎటూ తెగకుండా సాగుతుండా గుంటూరు మున్సిపల్ చైర్మన్ జానీమూన్-మంత్రి రావెల మధ్య వివాదం.., తాజాగా ఓ రిసార్ట్స్ డిప్యూటీ మేనేజర్ పై టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ దాడి.. ఇలా రోజురోజుకు టీడీపీ నేతల వివాదాలు చాంతాడంతా పెరిగిపోతూనే ఉన్నాయి.

బాపట్ల సూర్యలంక బీచ్ లో జరిగిన సినీ నిర్మాత కొరటాల సందీప్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సూర్యలంక బీచ్ సమీపంలో క్యాంప్ ఫైర్ వేసి అనుచరులు, స్నేహితులతో కలిసి స్టెప్పులేసినట్టు తెలుస్తోంది. అయితే ఏర్పాట్లు సరిగ్గా లేని కారణంగా ఎమ్మెల్సీ అన్నం సతీష్ అక్కడి సిబ్బందిపై దాడికి యత్నించినట్టు సమాచారం.
ఇదే క్రమంలో రిసార్ట్స్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్ పై కూడా ఎమ్మెల్సీ సతీష్ దాడి చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గదిలోకి లాక్కెళ్లి మరీ అతని చితకబాదినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు రిసార్ట్స్ అధికారులు పోలీస్ స్టేషన్ వెళ్లగా.. పోలీసులు కూడా వాళ్లకే ఝలక్ ఇచ్చారు. తెల్లారేదాకా స్టేషన్ లోనే ఉంచుకుని కేసు కూడా నమోదు చేయకుండా పంపించినట్టు తెలుస్తోంది.
పైగా.. ఈ సంగతి గనుక బయట లీక్ అయితే మీ సంగతి చూస్తా అంటూ ఎమ్మెల్సీ సతీష్ విలేకరులను బెదిరించారని తెలుస్తోంది. కాగా, గతంలోను ఎమ్మెల్సీ సతీష్ తన వివాదస్పద తీరుతో వార్తల్లోకి ఎక్కారు. ఇక నిర్మాత కొరటాల సందీప్ కూడా ఆమధ్య బాపట్ల లాడ్జిలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. ఏదేమైనా.. టీడీపీ నేతల తీరు మాత్రం ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా తయారైందనడానికి ఏమాత్రం సంశయం అక్కర్లేదేమో!












Click it and Unblock the Notifications