మోడీ, అమిత్ షా ఉచ్చులో చిక్కుకున్న జగన్, కేసీఆర్?
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ హయాంలోని భారతీయ జనతాపార్టీ వేరు.. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, అమిత్ షా హయాంలోని కమల దళం వేరు. మోడీ, షా ద్వయం రాజకీయం ఎలా ఉంటుందో.. ఎప్పుడు, ఎక్కడ ఏ మలుపు తీసుకుంటుందో వరికీ అంతుపట్టకుండా ఉంది. ఐదు సంవత్సరాల రాజకీయ ప్రణాళికను వారు ఈరోజే వేయగలుగుతున్నారు. అంతుపట్టని, అంతుచిక్కని వీరిద్దరి రాజకీయ రహస్యాన్ని ఛేదించడానికి విపక్షాలు ప్రయత్నించి విఫలమవుతున్నాయి.

అప్పటి సాన్నిహిత్యం ఇప్పుడేది?
తాజాగా వీరి దృష్టి దక్షిణాదిలోని రెండు తెలుగు రాష్ట్రాలపై పడింది. బలమైన రాష్ట్రంగా ఉన్నప్పుడు అధికారం దక్కించుకోవడం కష్టం. అందుకే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మొగ్గుచూపే బీజేపీ ఉమ్మడి రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపింది. ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం రెండడుగుల దూరంలో నిలిచింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ను దాటుకుంటే అధికారం చేజిక్కించుకోగలుగుతుంది. 2019లో ఏపీలో అధికారం దక్కిన తర్వాత వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సాన్నిహిత్యంగానే ఉండేవారు. మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత మొదట్లో ఉన్న ఆ సాన్నిహిత్యంకానీ, ఆ ఆత్మీయతకానీ ఇప్పుడున్నాయా? అంటే లేవని చెప్పవచ్చు.

విభజన హామీలు నెరవేర్చకుండానే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపు
ఏపీకి కేటాయించిన బల్క్‌డ్రగ్ పార్క్, రాష్ట్రానికి రావల్సిన ఆరువేల కోట్లరూపాయల విద్యుత్తు బకాయిలు వెంటనే చెల్లించాలంటూ తెలంగాణకు కేంద్రం జారీచేసిన హుకుం రాజకీయ విశ్లేషకుల్లో అనేక సందేహాలను లేవనెత్తుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి కేటాయించడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు రావల్సిన పార్క్‌ను కావాలనే ఏపీకి కట్టబెట్టారన్నారు. ఏపీనే తెలంగాణకు రూ.12వేల కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ ఆ రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు.

ఇద్దరి మధ్య బంధాన్ని తెంపడమే రాజకీయ వ్యూహం
బీజేపీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఏపీకి ఇస్తామన్న హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపుతోపాటు విద్యుత్తు బకాయిల విషయం వెనక అనేక రాజకీయ కోణాలు దాగివున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డ్రగ్ పార్క్, విద్యుత్తు బకాయిలపై ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు గొడవ పడుతున్నాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ కు జగన్, జగన్ కు కేసీఆర్ ఇద్దరూ పరస్పరం సహకరించుకున్నారనే విషయం మోడీ, షా మదిలో ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ముందుగా వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టాలనేదే వీరి రాజకీయ వ్యూహంగా ఉందంటున్నారు. ఏపీ కంటే తెలంగాణకే ముందుగా ఎన్నికలు జరుగుతాయి. వాటికి ఇంకా 15 నెలల సమయముంది. అప్పుడు జగన్ నుంచి సహకారం అందకుండా చూడాలి. దీనివల్ల చాలావరకు టీఆర్ఎస్ ను కట్టడి చేయవచ్చని మోడీ, షా భావిస్తున్నారు. వీరి ప్రణాళికను కేసీఆర్, జగన్ లో ఎవరైనా ఛేదిస్తారేమో చూడాలి.!!












Click it and Unblock the Notifications