హెరిటేజ్ ఫుడ్స్ నాదే -జగన్ సీఎం కావాలనుకున్నా..కానీ : చంద్రబాబు అలా మోసం చేసి-మోహన్ బాబు ...!!
సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లోనూ విలక్షణంగా వ్యవహరించే మోహన్ బాబు తాజా రాజకీయాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. అయితే, తరువాతి కాలంలో చంద్రబాబుతో విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. జగన్ కు మద్దతుగా ప్రచారం చేసారు. మంగళగిరిలో లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు.

వైసీపీలో కీలక పదవి ఇస్తారంటూ..
ఇక, వైసీపీ అధికారంలోకి రావటంతోనే ఆయనకు కీలక పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ, ఆయన ఈ మధ్య కాలంలో బీజేపీ కీలక నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా సన్ ఆఫ్ ఇండియా మూవీలోనూ బిజీగా ఉన్నారు. అయితే, ఏదైనా నిర్మోహమాటంగా చెప్పే మోహన్ బాబు..చంద్రబాబు-వైఎస్సార్ - జగన్ గురించి కొన్ని కీలక అంశాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. గెలిచినప్పుడు ప్రశంసించేవారు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు విమర్శించే వాళ్లు ఉంటారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

నాడు వాజ్ పేయ్ - అద్వానీలతో ఒకే కారులో..
శాంతంగా ఉన్నానని సచ్చు వెధవని అనుకోవద్దు.. గట్టిగా పిండితే గువ్వ అయినా ఎగిరి తంతుంది.. ప్రస్తుతం అదీ నా పరిస్థితి అంటూ చెప్పుకొచ్చారు. సామ్రాజ్యాలే పోయాయి. తన టీమ్, తనతో సహచర్యం చేసిన వారు.. ఆత్మీయులు, మిత్రులు కొందరు పోయారంటూ వివరించారు. పొలిటికల్‌గా అన్నీ చూశానన్నారు. తాను కొందరి తరఫున ప్రచారంలోనూ పాల్గొన్నాననే విషయాన్ని గుర్తు చేసారు. అప్పట్లో బీజేపీ కోసం వాజ్‌పేయి..తాను ఒకే కారులో ప్రచారానికి వెళ్లామని చెప్పుకొచ్చారు. అదే విధంగా అద్వానీ..తాను ఒకే కారులో వెళ్లామని చెప్పారు.

పనికిరానని చంద్రబాబు పంపేసారు..
అది ఇప్పుడు ఉన్న ఓ ప్రముఖ రాజకీయవేత్తకు తెలుస అంటూ పరోక్షంగా చంద్రబాబు గురించి మోహన్ బాబు ప్రస్తావించారు. అప్పట్లో నేను తెలుగుదేశంలో ఉన్నానని చెబతూ... కానీ తాను పనికిరానని తీసేశాడు అప్పటి ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు నిర్ణయాన్ని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాను ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీకి 18 శాతం ఓట్లొచ్చాయని గుర్తు చేసారు. తాను అభిమానించే అన్న (ఎన్టీఆర్)గారు తనను రాజ్యసభకి పంపించారని చెప్పారు. తాను రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి లోక్‌సభ ఎంపీగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ ను పరిచయం చేసింది చంద్రబాబే..
తాము ఇద్దరం బ్రదర్ అంటూ పిలుచుకొనే వాళ్లమని..ఆ తరువాత ఆయన బావగారు అయ్యారన్నారు. ఆయన తమ ఇంటికి రెండుసార్లు వచ్చారు.. నేను కూడా వారి ఇంటికి వెళ్లానని నాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను చూసినప్పుడు చాలా ఆనందంగా ఉండేదని... ఆయన ముఖంలో, ఆ పంచె కట్టులో ఓ రాజసం ఉండే దని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌గారిలా మాట ఇస్తే దానికి వైఎస్ కట్టుబడేవారని చెప్పారు. తాను ఆ రోజు అన్నయ్య కోసం టీడీపీకి వెళ్లానని... ఆ తర్వాత బీజేపీ మంచి పార్టీ.. దేశానికి కావాలని వెళ్లానని వివరించారు.

జగన్ సీఎం కావాలని...హరిటేజ్ నాదే..
జగన్ సీఎం కావాలని కోరుకుని తాను వెళ్లానని చెప్పారు. నేను ఎప్పుడూ ఏదీ ఆశించలేదని చెప్పటం ద్వారా ఎటువంటి పదవి కోరుకోవటం లేదనే విషయానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక, చంద్రబాబు- తనకు మధ్య విభేదాల గురించి వివరించారు. రాజకీయంగా తన మనసును గాయపరచింది చంద్రబాబు అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ తనదేనని వ్యాఖ్యానించారు. ఆ సంస్థలో తన డబ్బు, తన షేర్ ఎక్కువని... చంద్రబాబుది తక్కువని చెప్పారు.

నాడు వైఎస్సార్ కు వివరించి చెప్పాను..
రాజశేఖర రెడ్డి పాదయాత్రకి వెళ్లే ముందు తమ ఇంటికి వచ్చారని..ఆ సందర్భంలో.. నువ్వు, చంద్రబాబు ఫ్రెండ్సే కదా.. ఏంటి మీ ఇద్దరికీ గొడవ.. అని అడిగారని వివరించారు. వైఎస్‌ని అన్నపూర్ణ హోటల్‌లో తనకు పరిచయం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. హెరిటేజ్‌లో తన డబ్బు ఇంత, చంద్రబాబుది ఇంత, వేరే వ్యక్తిది ఇంత..ఇలా ఇలా మోసం చేశాడని తాను వైఎస్సార్ కు వివరించినట్లుగా మోహన్ బాబు వివరించారు. దీనికి స్పందనగా మామకే (ఎన్టీఆర్) వెన్నుపోటు పొడిచాడు.. నిన్ను మోసం చేయడంలో కొత్తేముందని అన్నారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. దీంతో..ఇప్పుడు మోహన్ బాబు చెప్పిన హెరిటేజ్ వాటాల విషయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications