సినిమా టికెట్ల రేట్లు ఫిక్స్: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్‌కు బంపర్ ఆఫర్: ఫస్ట్ మూవీ అదే
అమరావతి: ఏపీలో భారీ బడ్జెట్ సినిమాల సందడి మొదలు కాబోతోంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన సినిమాలను వరుసబెట్టి విడుదల కానున్నాయి. పవన్ కల్యాణ్-రానా నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్, ప్రభాస్-పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ సర్కారువారి పాట, మెగాస్టార్ నటించిన ఆచార్య, తమిళం రీమేక్ మూవీ వలీమై..ఇవన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సామరస్య పరిష్కారం..
ఈ పరిస్థితుల్లో- సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో టాలీవుడ్ హీరోలు దర్శకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో- ఈ అంశం సామరస్యపూరకంగా పరిష్కారానికి నోచుకున్నట్టుగా చెబుతున్నారు. వైఎస్ జగన్‌తో సమావేశం సంతృప్తికరంగా సాగిందంటూ చిరంజీవి సైతం స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తుల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని తేల్చి చెప్పారు. చిరంజీవి చేసిన ఈ ప్రకటనతో ఇక అందరి దృష్టీ ప్రభుత్వంపై నిలిచింది.

భీమ్లా నాయక్‌కు బంపర్ ఛాన్స్
ఈ నెల 25వ తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రాణా నటించిన మల్టీస్టారర్ మూవీ ఇది. సితార ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై తెరకెక్కింది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సాగర్ కె చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ సినిమా సంక్రాంతి పండగ నాటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది యూనిట్. ఇప్పుడు తాజాగా 25 తేదీన విడుదల కానుంది.

విడుదలకు ముందే టికెట్ల రేట్లు..
ఈ పరిస్థితుల మధ్య- సినిమా టికెట్ల రేట్లను ఖరారు చేయడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భీమ్లా నాయక్ విడుదల కావడానికి ముందే సవరించిన టికెట్ల రేట్లు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త ధరలను నిర్ధారించిన తరువాత విడుదల కానున్న తొలి సినిమా కూడా భీమ్లా నాయక్ కానుంది. టాలీవుడ్ ప్రముఖుల సూచనలు, విజ్ఞప్తులకు అనుగుణంగా టికెట్ల రేట్లను సవరించనున్న ప్రస్తుత పరిస్థితుల్లో- పవన్ కల్యాణ్ సినిమాకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టే అవుతుంది.

మధ్యేమార్గంగా..
కాగా- అటు చిత్ర పరిశ్రమకు నష్టం కలిగించని విధంగా.. ఇటు సాధారణ, మధ్య తరగతి ప్రేక్షకులకు నిరుత్సాహానికి గురి చేయని విధంగా, మద్యేమార్గంగా సినిమా టికెట్ల రేట్ల శ్లాబులను ప్రభుత్వం నిర్ధారిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. రేట్లను నిర్ధారించడానికి ఇదివరకే ప్రభుత్వం- ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలను తీసుకుని.. టికెట్ల రేట్లను నిర్ధారించినట్లు చెబుతున్నారు. అయిదో ఆటకు అనుమతి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్టే.
Recommended Video

రేపు తుది విడత భేటీ..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ గురువారం ఉదయం చివరి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ తుది భేటీతో సినిమా టికెట్ల ధరల విషయం ఓ కొలిక్కి వస్తుంది. ఉదయం 11.30 నిమిషాలకు ఈ కమిటీ సచివాలయంలో సమావేశమౌతుంది. ఇప్పటికే- దీనిపై తుది ప్రతిపాదనలను కమిటీ సిద్ధం చేసింది. తుది సమావేశంలో టికెట్ల శ్లాబులను నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేస్తుంది.












Click it and Unblock the Notifications