ఆ రోజూ చూస్తూనే ఉన్నా, ఫోన్ రాగానే.. ఇది జరిగింది!: పవన్‌పై జేసీ కొడుకు సంచలనం
Recommended Video

అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రజలు ఆదరించరని, ఆయన రెండు పడవలపై కాలు పెడుతున్నారని అభిప్రాయపడ్డారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి టిక్కెట్లు దక్కని వారే ఆ పార్టీలో చేరుతారని చెప్పారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కు కనీసం పది ఓట్లు, సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కుంటుకుంటూ నడుస్తూ కమ్యూనిస్టులను ఓ కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోటీ చేసేందుకు ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా లేరని విమర్శించారు.

పవన్ కళ్యాణ్‌తో కొంచెం పరిచయం ఉంది
పవన్ కళ్యాణ్‌తో తనకు కొంచెం పరిచయం ఉందని పవన్ రెడ్డి తెలిపారు. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి, వాటిని దక్కించుకోలేని వారు వచ్చే ఎన్నికల సమయంలో జనసేనలోకి వెళ్తారని చెప్పారు. అనంతపురం జిల్లాకు చెందిన వారే పవన్ చుట్టూ ఉండి, ఆయనకు సలహాదారులుగా ఉన్నారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో గుర్తుకు ఉంది
గుంటూరు బహిరంగ సభ సమయంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునని జేసి పవన్ రెడ్డి అన్నారు. కానీ హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. లూజ్ కనెక్షన్ ఏర్పడినట్లుగా ఉందని, అందుకే తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

జగన్ గురించి మాట్లాడుతారేమోనని టీవీ చూస్తూనే ఉన్నా
గుంటూరు సభ సమయంలో తాను టీవీ చూస్తూనే ఉన్నానని, లోకేష్‌ను విమర్శించిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా మాట్లాడుతారా అని ఎదురు చూశానని, తండ్రి హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన జగన్ పైన విమర్శలు లేకుండానే ప్రసంగం ముగించారని జేసీ పవన్ రెడ్డి అన్నారు.

పవన్ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు
ముందు రోజు వరకు తెలుగుదేశం పార్టీతో బాగా ఉండి, రాత్రికి రాత్రే పవన్ యూటర్న్ తీసుకున్నారని, అలా ఎందుకు పారిపోయారని జేసీ పవన్ రెడ్డి ప్రశ్నించారు. తనకు ఉన్న సమాచారం మేరకు పవన్‌కు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని, మీరు టీడీపీతో ఉండవద్దని, మీకు ఎంత కావాలంటే అంత ముడుతుందని ఆ ఫోన్ కాల్ సారాంశమని, అందుకే ఆయన యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోందని సంచలన ఆరోపణ చేశారు. అప్పటి నుంచి పవన్ టీడీపీని టార్గెట్ చేశారన్నారు.












Click it and Unblock the Notifications