వైసీపీ ట్రోలింగ్ పై ఈసీకి ఆ పార్టీ మాజీ ఎంపీ ఫిర్యాదు..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా నేతలు వదులుకోవడం లేదు. ఈ క్రమంలో వాస్తవాలతో సంబంధం లేకుండా ప్రత్యర్ధులపై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇలాంటిదే ఓ కేసులో ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ తన మాజీ పార్టీ నేతలపై ఇవాళ సీఈవో ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
తాజాగా విశాఖలో భారీ ఎత్తున డ్రగ్స్ ను సీబీఐ సీజ్ చేసింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ ను విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ తెప్పించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో వాస్తవాల నిర్దారణకు సీబీఐ ప్రయత్నిస్తుండగానే ఇందులో వైసీపీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరును వైసీపీ తెరపైకి తెచ్చింది. తమ పార్టీ మాజీ ఎంపీకి ఈ సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్ధ ప్రతినిధులు దగ్గరివారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. దీనిపై ఆయన ఇవాళ ఈసీని ఆశ్రయించారు.

సోషల్ మీడియాలో తనపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. వైసీపీ నేతలు వాస్తవాలు చూసుకోకుండా తనపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా తనపై వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఇవాళ సచివాలయంలో సీఈవోను కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చానని, ఆయన లేకపోవడంతో అదనపు సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications