పుంగనూరు దాడులకు కథ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్ వారిద్దరు!!
పుంగనూరులో ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి పై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో వైసీపీ శ్రేణులు ప్రతిదాడులు చేశారు. దీంతో ఒక్కసారిగా పుంగనూరు రణరంగంగా మారింది.
రణరంగంగా పుంగనూరు
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో వైసీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పుంగనూరులో టిడిపి నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన మిథున్ రెడ్డి పైన కూడా నేడు రాళ్ల దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

చంద్రబాబు, లోకేష్ పై సంచలన ఆరోపణలు
ఇదిలా ఉంటే పుంగనూరులో నేడు జరిగిన దాడి పైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారని, రాళ్లతో, మారణాయుధాలతో ఈరోజు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. పుంగనూరులో ఈరోజు జరిగిన దాడుల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉన్నారని వారి డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

అభివృద్ధి అడ్డుకునే కుట్ర
పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈరోజు దాడులు చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా పోలీసుల్లో చలనం లేదన్నారు. 5000 కోట్లతో ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సాధ్యమైతే మంచి చెయ్యాలని, కానీ ఇలా దాడులు చెయ్యటం సరికాదన్నారు.
చంద్రబాబు సర్కార్ కు హెచ్చరిక
తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా, దాడులు చేస్తున్నారని, తమ వాహనాలను ధ్వంసం చేశారని, ఇప్పటికి రాళ్లదాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో టిడిపి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి ఎల్లకాలం మీ ఆటలు సాగవని ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications