ఇంత చిన్న లాజిక్ మరిచిపోతే ఎలా జీ
Peddireddy Mithun Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై లోక్‌సభ పక్ష నేత చీఫ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తమపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
దర్యాప్తులో నిరూపించలేక..
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమపై చేసిన వరుస ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా నిజమని దర్యాప్తులో నిరూపించలేక పోయారని అన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న నేతలను దెబ్బతీయాలనే లక్ష్యంతో రాజకీయంగా చేయిస్తున్న ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు.
పాలన గాలికి వదిలేసి..
కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి కేవలం కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడిగా తనపైనా అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు.

ఫైల్స్ కలెక్టర్ కార్యాలయంలో కూడా..
మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్ప్ దగ్ధం ఘటనలో తమపై బురద చల్లారని, రెవెన్యూ కార్యాలయంలో ఫైల్స్ అనేవి ఫిజికల్ గానే కాదు, ఆన్‌లైన్ లోనూ ఉంటాయని, అలాగే ఒక్క ఆర్డీఓ కార్యాలయంలోనే అన్ని ఫైల్స్ ఉండవని, వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కూడిన ఫైల్స్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉంటాయని గుర్తు చేశారు.
ఆధారాలను ఉంటే చూపండి..
అయినా రాజకీయ దురుద్దేశంతో తమపై దుష్ర్పచారం చేయడానికి కూటమి ప్రభుత్వం తెగబడిందని మిథున్ రెడ్డి అన్నారు. ఫలానా భూమి కోసం ఇలా చేశారంటూ తమపై నిర్ధిష్టమైన ఆధారాలను ఉంటే చూపండంటూ గతంలో అనేక సార్లు ప్రశ్నించినా కూడా ఎవరూ సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు.
గౌతమ్ తేజ్ అనే ఉద్యోగి..
ఈ ఘటనలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ అనే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారని, అతని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం అంతా తెలుగుదేశం సానుభూతిపరులమని, చంద్రబాబు తమకు బంధువు కూడా అవుతారని, అయినా తమ కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వాపోయారని అన్నారు.
తేల్చింది శూన్యమే..
మదరపల్లి ఫైల్స్ దగ్ధం అంటూ చేసిన దర్యాప్తులో ఇప్పటి వరకు ప్రభుత్వం తేల్చింది శూన్యమేనని పెద్దిరెడ్డి అన్నారు. అసలు భూ అక్రమాలే లేనప్పుడు ఆ భూముల రికార్డులు ఎవరు దగ్ధం చేస్తారు? ఎవరికి అవసరం? ఉందని ఆయన ప్రశ్నించారు.
నిరూపితం కాలేదు..
కరుడుగట్టిన నేరస్తులకు నిజాలు తెలుసుకునేందుకు సత్యశోధన పరీక్షలు చేస్తుంటారని, గౌతమ్ తేజ్‌కు కూడా పోలీసులు సత్యశోధన పరీక్ష చేయించారని, అందులో కూడా అతను కుట్రపూరితంగా వ్యవహరించాడని కానీ, నేరం చేసినట్లుగా గానీ నిరూపితం కాలేదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్..
అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఒక గంట ముందే అతను ఇంటికి వెళ్లిపోయాడని, ఈ విషయం సీసీ కెమేరాల్లో కూడా ఇది రికార్డు అయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మాత్రం దీనిని రాజకీయం చేయాలనే దురుద్దేశంతోనే హుటాహుటిన డీజీపీని హెలికాఫ్టర్‌లో పంపడం, రెవెన్యూ కార్యదర్శిని పంపడం, చంద్రబాబు, మంత్రులు దీనిపై నిత్యం మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని విమర్శించారు.
మైనింగ్ కార్యాలయాలను సీజ్ చేసి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనింగ్‌లో గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు దోచేసిందంటూ ఆరోపణలు చేసిందని పెద్దిరెడ్డి చెప్పారు. రెండు నెలల పాటు మైనింగ్ కార్యాలయాలను సీజ్ చేసి, పోలీసుల భద్రత మధ్య తనిఖీలు చేయించారని, వారి దర్యాప్తులో ఏం తేల్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్క రూపాయి అయినా అక్రమం జరిగినట్లు..
కూటమి ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల ఆరోపణల్లో కనీసం ఒక్క రూపాయి అయినా అక్రమం జరిగినట్లు, దోపిడీ జరిగినట్లు గుర్తించారా? వందలాది మైన్లలో అక్రమాలు ఉన్నాయని అన్నారు. ఒక్క మైన్ లో అయినా తప్పు జరిగినట్లు తేల్చారా?.. అని నిలదీశారు. వీటిపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు.
75 ఎకరాల అటవీ భూమిని కబ్జా..
తాజాగా 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశామంటూ తమ కుటుంబంపై మరో అబద్దపు ఆరోపణలను తెరమీదికి తీసుకు వచ్చారని మిథున్ రెడ్డి చెప్పారు. అవన్నీ కూడా తమ సొంత భూములేనని, 2000 సంవత్సరంలోనే రిజిస్టర్ అయినవని ఆరోజే అన్ని ఆధారాలను మీడియా ముందు చూపించామని అన్నారు. 75.76 ఎకరాల భూమి తమ కుటుంబసభ్యులకు ఉందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్ నివేదికలోనూ..
ప్రభుత్వ ఆదేశాలతో జరిపించిన దర్యాప్తులోనూ, జిల్లా కలెక్టర్ నివేదికలోనూ ఎటువంటి కబ్జాలు జరగలేదని నిరూపితమైందని మిథున్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు తమపై పెద్ద ఎత్తున భూకబ్జా అంటూ దుమ్మెత్తి పోశారని, అవ్వన్నీ అబద్దాలని నిర్ధారణ జరిగిన తరువాత మౌనంగా ఉంటే సరిపోదని, తమపై ప్రభుత్వ పెద్దలు చేసినవి విషప్రచారం తప్పేనని బహిరంగంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు.
లిక్కర్ స్కాం అంటూ..
లిక్కర్ స్కాం అంటూ మరో కొత్త నాటకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారని పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ ఎక్స్ అకౌంట్‌లో మద్యం కుంభకోణంలో రూ.3000 కోట్లకు పైగా ఆక్రమాలకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేశారని, ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే చాలా పెద్ద కుంభకోణం అంటూ ప్రచారం ప్రారంభించారని అన్నారు.
ఇంత చిన్న లాజిక్..
ఢిల్లీలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటుపరం చేయడం వల్ల స్కాం జరిగిందనే ఆరోపణలు వచ్చాయని, ఏపీలో ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోని మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకుని నిర్వహించిందని, ఇందులో స్కాం ఎలా జరుగుతుందని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ మరిచిపోతే ఎలా అని అన్నారు.
ప్రతిసారీ ఇలా తప్పుడు ఆరోపణలతో..
గతంలో 50,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారని, ఇప్పుడు ఈ సంఖ్యను 3,000 కోట్ల రూపాయలు అంటూ కూటమి ప్రభుత్వం చెబుతోందని ఎద్దేవా చేశారు. ప్రతిసారీ ఇలా తప్పుడు ఆరోపణలతో తమపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
జగన్‌ను దెబ్బకొట్టాలంటే..
జగన్‌ను దెబ్బకొట్టాలంటే ఆయన చుట్టూ ఉన్న నాయకులను బలహీనరపచాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలో ఇవన్నీ భాగమేనని, ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడితే అంతే బలంగా వాటిని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని, ఇటువంటి అరాచక విధానాలపై న్యాయపోరాటం చేస్తామని పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications