రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీనా?: చంద్రబాబు కామెంట్లపై భగ్గు
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో కనిపించిన లోపాలను ఆ పార్టీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైన తీరును ఎండగడుతోంది.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ జగన్‌కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు రక్షణ కల్పించడంలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.

తాజాగా ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నష్టాల్లో ఉన్న మిర్చి రైతులను జగన్ పరామర్శించడాన్ని చంద్రబాబు ఇల్లీగల్ యాక్టివిటీగా అభివర్ణించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నాయకుడికి ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మధ్యాహ్నం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జగన్ ప్రజల్లో తిరగకుండా ఉండటానికి భద్రత కుదించారని ఆరోపించారు.
ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమంటూ చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీనా అంటూ నిలదీశారు. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూరకంగానే జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ధ్వజమెత్తారు. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి అని నిలదీశారు.
తమ ప్రభుత్వ హయాంలో 24 రకాల పంటలకు మద్దతు ధర కల్పించిందని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. విజయవాడలో ఓ చిన్నారి జగన్‌తో ఫొటో దిగడాన్ని సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం చేస్తోన్నారంటూ మండిపడ్డారు. చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు ఖండించరని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications