బోస్ పై పని చేసిన సీఎం జగన్ మంత్రం - వెనుకడుగు, రాజీ ఫార్ములా...!!
ఎంపీ బోస్ ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. సీఎం జగన్ మంత్రం పని చేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననే వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. రామచంద్రాపురంలో అభ్యర్ది విషయంలో సీఎం సరైన నిర్ణయం తీసుకుంటారని ధీమా వ్యక్తం చేసారు. వైసీపీని వీడటం లేదని స్పష్టం చేసారు. ఎంపీ వర్సస్ మంత్రి మధ్య తారా స్థాయికి వెళ్లిన కోల్డ్ వార్ నేపథ్యంలో సీఎం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఇద్దరు సైలెన్స్ అయ్యారు.
బోస్ వెనుకడుగు : ఎంపీ బోస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చిన తీరు సంచలనంగా మారింది. తొలి నుంచి సీఎం జగన్ కు సన్నిహితుడుగా పేరున్న బోస్ రాజీనామా చేస్తానని చేస్తానని చెప్పటంతో కలకలం మొదలైంది. దీని పైన సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. బోస్ తో మాట్లాడారు. దీనికి ముందు పార్టీ గోదావరి జిల్లాల సమన్వయకర్త మిధున్ రెడ్డి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మంతనాలు చేసారు.

మంత్రి తీరు..రామచంద్రాపురం నియోకవర్గంలో పరిస్థితుల పైన త్రిమూర్తులు పూర్తి సమాచారం ఇచ్చారు. మంత్రి తీరు పైన విమర్శలు ఉన్నాయని వివరించారు. ఈ విషయాలు మిథున్ రెడ్డి ద్వారా సీఎంకు చేరాయి. వెంటనే సీఎం జగన్ ఎంపీ బోస్ తో మాట్లాడారు. తాను చెప్పదలచుకున్నది తేల్చి చెప్పారు.
పని చేసిన వ్యూహం : బోస్ వర్సస్ మంత్రి వేణు కోల్డ్ వార్ లో అసలు ఇద్దరికీ కాకుండా సీటు చేజారిపోతుందనే సంకేతాలు బలంగా పార్టీ నుంచి ఇవ్వగలిగారు. మధ్యలో బోస్ జనసేన లో చేరుతున్నారనే లీకులు వచ్చాయి. దీంతో, బోస్ కు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. నేరుగా చర్చించారు. సీటు విషయంలో సర్వే తరువాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పార్టీ మారే విషయం పైన లీకుల గురించి ఆరా తీసారు. తమకు ఎటువంటి ఆలోచన లేదని బోస్ స్పష్టం చేసారు. ఇదే విషయం మీడియా సమావేశంలో స్పష్టం చేయాలని సూచించారు. దీంతో, రామచంద్రాపురం చేరుకున్న బోస్ మీడియా సమావేశంలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసారు.

సీఎం కు బోస్ క్షమాపణ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆయన తనయుడు సీఎం జగన్ కూడా అదేవిధంగా తనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయనే బాధతోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పానని వివరించారు.
నియోజకవర్గంలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం చెప్పిందని వెల్లడించారు. నియోజకవర్గంలో పరిపూర్ణమైన సర్వేలు జరిగాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. అంతవరకు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించిందని తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు పని చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications