ఎంపీ బోసు అల్టిమేటం, అదే జరిగితే పార్టీ వీడుతా - నో కాంప్రమైజ్..!!
ఎన్నికల వేళ కీలక జిల్లాలో వైసీపీలో కలకలం మొదలైంది. సీనియర్ నేత ఎంపీ పిల్లి బోసు పార్టీకి తాజాగా అల్టిమేటం జారీ చేసారు. మంత్రి వేణు వర్సస్ ఎంపీ పిల్లి బోసు మధ్య రామచంద్రాపురం లో కొంత కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. సీఎం జగన్ తో తాజాగా బోసు సమావేశమయ్యారు. మిథున్ రెడ్డి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
మంత్రి వేణు వర్సస్ ఎంపీ పిల్లి: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వేణు వర్సస్ ఎంపీ పిల్లి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. గత వారం మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఎంపీ పిల్లి బోసు మద్దతు దారులు సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకు సీటు ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి వేధిస్తారని మండి పడ్డారు.

ఎంపీ బోసు తనయుడుకు వచ్చే ఎన్నికల్లో రామ చంద్రా పురం సీటు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశం తరువాత ఎంపీ బోసును సీఎం జగన్ తాడేపల్లికి పిలిచారు. నియోజకవర్గంలో పరిణామాలపై చర్చించారు. పిల్లి కుమారుడు భవిష్యత్ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. కలిసి పని చేయాలని సూచించారు. కానీ, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు.
పార్టీ వీడేందుకు సిద్దం: ఈ రోజు పిల్లి సమావేశానికి కౌంటర్ గా మంత్రి వేణు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసామని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి వేణు ఏర్పాటు చేసిన సమావేశానికి తనకు ఆహ్వానం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకు సీటు ఇస్తే తన మద్దతు ఉండదని స్పష్టం చేసారు. మద్దతివ్వాల్సిన పరిస్థితి వస్తే తాను పార్టీలో ఉండనని తేల్చి చెప్పారు. పార్టీ టికెట్ వేణుకు ఇస్తే తాను పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలుస్తున్నానని ప్రకటించారు. వేణుతో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పార్టీకి నష్టం జరిగినా తనకు కేడర్ ముఖ్యమని బోసు స్పష్టం చేసారు.
పార్టీకి నష్టమైనా కేడర్ ముఖ్యం: కార్యకర్తల మద్దతు లేకపోతే తమకు పార్టీ నాయకత్వం వద్ద గుర్తింపు ఉండదన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధించారని వేణును ఉద్దేశించి ఆరోపించారు. వేణు పార్టీ అభ్యర్ధి అయితే సమర్ధించే సమస్యే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. వేణును పార్టీ అభ్యర్దిగా ప్రకటిస్తే తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు.
ఎంపీ బోసు తొలి నుంచి జగన్ కు విధేయుడిగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవిని వదులుకున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడినా..ఎమ్మెల్సీగా, మంత్రిగా..రాజ్యసభ సభ్యుడిగా బోసుకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎంతో సమావేశం తరువాత..వేణుకు సీటు ఇస్తే పార్టీని వీడుతానంటూ చేస్తున్న హెచ్చరికలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ నియోజకవర్గంపై సీఎం నిర్ణయం ఏంటనేది ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications