మహమ్మద్ గజినీలా దండయాత్ర చేసినా.. వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖలో రఘురామ సంచలన వ్యాఖ్యలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు.
ఇక ఆ రాజీనామా లేఖలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తన పార్లమెంటు సభ్యత్వాన్ని టార్గెట్ చేసి తనపై అనర్హత వేటు వేయడానికి మహమ్మద్ గజనీ తరహాలో అనేక సార్లు దండయాత్ర చేసి, ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయినప్పటికి అవి మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదని తన రాజీనామా లేఖలో రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

మీరు మీ దుర్మార్గమైన చర్యలతో నాపై దాడి చేసిన ప్రతిసారి నేను మరింత పాజిటివ్ గా ముందుకు వెళ్లానని, మరింత బలోపేతం అయ్యానని, చాలా సమర్థవంతమైన చర్యలను తీసుకున్నానని నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేశానని పేర్కొన్నారు.
మీ భయంకరమైన దాడి మధ్యలోనూ నేను ప్రజలు ప్రశంసించే విధంగా పని చేయగలిగానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రజల కోసం మంచి చేయగల, బలంగా పనిచేయగల నాయకుడిగా నేను ముద్ర వేసుకున్నాను అని చెబుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని నా రాజీనామాను అంగీకరిస్తూ, మీ స్పందన కోరుతున్నాను అంటూ రఘురామ కృష్ణంరాజు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
ఇక ఇది ప్రతి ఒక్కరికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లవలసిన టైమ్ అని పేర్కొన్న రఘు రామ కృష్ణం రాజు, తన లేఖ ద్వారా మన ఇద్దరికీ ఈ అసహ్యకరమైన, రక్షణలేని బంధం నుండి ఒక్కసారే విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications