ఏపీలో ముందస్తుపై రఘురామ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు సంబంధించి జోరుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లివచ్చిన తర్వాత దీనిపై మరిన్ని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో జగన్ కీలక ప్రకటన చేయబోతున్నారని, అందుకు ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా అనుమతి తీసుకున్నారనేది ఈ వార్తల సారాంశం. రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో దీనిపై జోరుగాప్రచారం జరుగుతోందన్నారు. కొత్త అప్పుల కోసం జగన్ ప్రభుత్వం ఎదురుచూస్తోందని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సరిపోయేంత నిధులు కూడా లేవని, అందుకే ముందస్తుకు వెళ్లడం తప్ప ముఖ్యమంత్రి దగ్గర మరో మార్గం లేదన్నారు.
ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని, అది ఏమైందని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మాట తప్పడం ముఖ్యమంత్రికి అలవాటైపోయిందని, జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల పట్ల తన వైఖరిని జగన్ మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రంలో ముందస్తుకు సంబంధించిన ఊహాగానాలు తామరతుంపరలుగా వస్తున్నాయి. అయితే వీటిని వైసీపీ అధిష్టానంకానీ, పార్టీ నేతలు కానీ ఖండించడంలేదు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ శ్రేణులను ముందస్తు ఎన్నికలు వస్తాయని, ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలంటూ కదలిక తెస్తున్నారు. ఈ ఏడాది వేసవిలోకానీ, డిసెంబరులోకానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు.












Click it and Unblock the Notifications