అది విజయసాయి రెడ్డి రాజధాని.. అప్పుడు తుగ్లక్.. ఇప్పుడు..!: రామ్మోహన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సారి మూడు రాజధానుల అంశంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఒకటే రాజధాని.. అది కూడా అమరావతే ఉండాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు స్పష్టం చేస్తుండగా.. మూడు రాజధానులపై తగ్గేదే లేదంటూ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.

వైసీపీది అవినీతి వికేంద్రీకరణేనంటూ రామ్మోహన్నాయుడు ఫైర్
తాజాగా, టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు వైసీపీ సర్కారుపై విమర్శలు దాడికి దిగారు. అధికార పార్టీది అభివృద్ధి వికేంద్రీకరణ కాదని.. అవినీతి వికేంద్రీకరణ అని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు రామ్మోహన్నాయుడు.

అది విజయసాయి రెడ్డి రాజధానే అంటూ రామ్మోహన్
విశాఖ రాజధాని కాదు.. అది విజయసాయి రెడ్డి రాజధాని అంటూ రామ్మోహన్నాయుడు విమర్శించారు. విజయసాయి రెడ్డి విశాఖలో భారీగా భూములు ఆక్రమించారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్నాయుడు విమర్శలు చేయడం గమనార్హం. శాంతియుతంగా యాత్ర చేస్తున్న అమరావతి రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. రాజధానుల మార్పు యోచన నాడు తుగ్లక్‌ది.. నేడు జగన్‌ది అని విమర్శించారు.

అప్పుడు తుగ్లక్.. ఇప్పుడు ఏపీ సీఎం అంటూ రామ్మోహన్నాయుడు
ఉత్తరాంధ్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అని రామ్మోహన్నాయుడు అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి.. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని రామ్మోహన్నాయుడు ఆరోపించారు. కాగా, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇది టీడీపీ నేతలు చేయిస్తున్న యాత్రేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేగాక, విశాఖను రాజధానిగా కోరుతూ మహా గర్జన పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికార పార్టీ నేతలు.