పవన్ బిగ్ యాక్షన్ ప్లాన్- ఆరు జిల్లాల్లో
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 'స్వచ్ఛ గోదావరి- పవిత్ర పుష్కరాలు' పేరిట సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం. దీనిలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో గుర్తించిన 262 పుష్కర పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని, నదిలోకి వ్యర్థాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నదీ జలాల పర్యవేక్షణకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణ, పారిశ్రామిక కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూంను నెలకొల్పాలని నిర్దేశించారు. ఈ కంట్రోల్ రూం నిర్వహణ బాధ్యతలను ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కు అప్పగిస్తారు.

గోదావరి నది ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉందని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఆరు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల నుండి రోజూ సుమారు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు నదిలో కలుస్తూ జీవ నదిని కలుషితం చేస్తున్నట్టు గుర్తించారు. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ నుండే రోజుకు 32 మిలియన్ లీటర్ల వరకు వ్యర్థాలు విడుదల అవుతుండగా, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి నిత్యం 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం దీనికి తోడవుతోంది. ప్రజారోగ్యం, పర్యావరణ భద్రత దృష్ట్యా ఈ కాలుష్య నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.
పుష్కర పంచాయతీల్లో గ్రామీణ వ్యర్థ జలాల నిర్వహణకు ఆయన పలు సూచనలు చేశారు. వీబీజీ రాంజీ పథకం కింద గృహ వినియోగ మురుగు నీటిని నియంత్రించేందుకు మ్యాజిక్ డ్రెయిన్లు, బ్లాక్ వాటర్ నిర్వహణకు సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత గృహాలలో ట్విన్ పిట్‌లను నిర్మించాలని ఆదేశించారు. కాలువలు, డ్రెయిన్ల ద్వారా మురుగు నేరుగా నదిలో కలవకుండా పంచాయతీ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
పట్టణ ప్రాంతాల నుండి విడుదలయ్యే మురుగునీటిని తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి వదలాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందుకోసం ప్రతి మున్సిపాలిటీ తమ సామర్థ్యానికి అనుగుణంగా మురుగు శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) నిర్మించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే మంజూరు చేసిన రూ. 100 కోట్ల నిధులను, అవసరమైతే స్వచ్ఛాంధ్ర నిధులు, వీబీ జీ రాం జీ నిధులను కూడా వినియోగించుకుంటూ దశలవారీగా ఈ ప్రణాళికలను అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
పారిశ్రామిక కాలుష్య నివారణకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పారిశ్రామిక వర్గాలు తగినంత పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. అలాగే, మురుగు, ద్రవరూప కాలుష్యాన్ని నియంత్రించేందుకు అన్ని పరిశ్రమలు ఆధునిక సాంకేతికతతో కూడిన శుద్ధి వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.
గోదావరి పరివాహకంలోని అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగంపై దశలవారీ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. భక్తులందరూ స్వచ్ఛమైన గోదావరి జలాల్లో పవిత్రమైన పుష్కరాలు జరుపుకోనేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, పుష్కరాలకు ముందే అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వ్యర్థాల శుద్ధి, విడుదలపై నిరంతర సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాంతాలవారీగా స్క్రీన్లు, సీసీ కెమెరాలతో అనుసంధానించి, మురుగు శుద్ధి కేంద్రాల పనితీరును, నేరుగా గోదావరిలోకి వ్యర్థాలు విడుదలవుతున్నాయా లేదా అని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పారిశ్రామిక మురుగు నీటి నిర్వహణను కూడా ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా పరిశీలించాలని అన్నారు.












Click it and Unblock the Notifications