హోదా కోసం: సత్యహరిశ్చంద్ర గెటప్‌లో శివప్రసాద్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ పార్లమెంట్ ఆవరణలో మంగళవారం వినూత్న నిరసనకు దిగారు. హరిశ్చంద్రుడి వేషంలో కుండ భుజంపై పెట్టుకొని, చేతిలో కట్టె పట్టుకొని శివప్రసాద్ హరిశ్చంద్రుడి వేషంలో పార్లమెంటుకు వచ్చారు.
రాజధాని లేదని, లోటు బడ్జెట్ ఉందని అయినా ప్రత్యేకహోదా ఇవ్వలేదని.. అందుకోసమే హరిశ్చంద్రుడి వేషంలో వచ్చి నిరసన తెలిపానని శివప్రసాద్ చెప్పారు. ఇచ్చిన మాటను తీర్చి హరిశ్చంద్రుడిలా నిరూపించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని ఎంపి కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతున్నారని, రాష్ట్రానికి నిధులు తీసుకురాకుండా పార్లమెంటుకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నిస్తున్నారని శివప్రసాద్ చెప్పారు. నా భావ ప్రకటనను చేసేందుకే ఈ విధంగా పార్లమెంటుకు వచ్చానని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నట్లు శివప్రసాద్ తెలిపారు.
కళాకారుడు సమస్యలు చూసి వదలడని, ఆందోళన చేయకుండా ఉండలేడని ఎంపి అన్నారు. ఏపి ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని, ఈ విషయంలో ఓ కళాకారుడిగా తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. గతంలో కూడా ఎంపి శివప్రసాద్ పలుసార్లు విభిన్న వేశాల్లో సమావేశాలకు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications