మోడీ! ఎవరో పవన్‌తో తిట్టిస్తావా, లోకేష్‌ను తొక్కేస్తారా: టీడీపీ
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీలు మూకుమ్మడి మాటల దాడి చేస్తున్నారు. ఢిల్లీలో ఎంపీ శివప్రసాద్ జనసేనానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆయన రోజుకో వేషధారణలో నిరసన తెలుపుతున్నారు. గురువారం ముస్లీం వేషధారణలో ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై మండిపడ్డారు.

మోడీ ఎవరో పవన్ కళ్యాణ్‌ను తీసుకొచ్చి
మోడీ గారు! ఎవరో పవన్ కళ్యాణ్‌ను తీసుకు వచ్చి మాకు పొమ్మని చెప్పలేక పొగబెడతారా అని శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై, మంత్రి నారా లోకేష్‌పై నిందలు సరికాదని ఆయన అన్నారు.

లోకేష్ చిన్నపిల్లవాడు
నారా లోకేష్ చిన్నపిల్లవాడు అని, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడని శివప్రసాద్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం, ఐటీ, ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై నిందలు సరికాదని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు.

పవన్ కళ్యాణ్‌తో తిట్టిస్తారా, వెనుక బీజేపీ
ఏపీకి అన్యాయం జరిగిందని, కాబట్టి తాము తమ హక్కుల కోసం పోరాడుతున్నామని, కానీ మీరు చేసే పని ఇదా అని మోడీపై శివప్రసాద్ మండిపడ్డారు. హోదా కోసం పోరాడుతుంటే పవన్‌తో తిట్టిస్తారా అన్నారు. ఇలా చేస్తే అల్లా మీకు న్యాయం చేయడని, మాట ఇచ్చి తప్పడం నీచమైన పని అని, పవన్ వెనుక మోడీ ఉన్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన టీడీపీ
పవన్ కళ్యాణ్ టీడీపీని టార్గెట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందని, బీజేపీకి, పవన్‌కు ఎవరు రాయబారం నడిపారనే విషయమై త్వరలో తేలిపోతుందని, చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించడం సరికాదని టీడీపీ నేతలు అంటున్నారు. హోదా కోసం ఉద్యమిస్తుంటే బీజేపీ పవన్, జగన్‌లను తమపైకి ఎగదోస్తోందన్నారు.

ఎదుగుతుంటే తొక్కేయాలని చూస్తారా
లోకేష్ మంచి నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో తొక్కేయాలని చూస్తున్నారని, అందుకే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవిర్భావ సభలో పవన్ పార్టీ గురించి, మోడీ గురించి, జగన్ గురించి మాట్లాడలేదన్నారు. ఎమ్మెల్యేలు అవినీతిపరులు అని చెప్పడంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications