ఏపీలో 2027లోనే ఎన్నికలు - ఢిల్లీ అలర్ట్, ఆట మొదలు..!!
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా ప్రధాని జమిలి పైన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే జమిలికి అనుకూలంగా సీఎం చంద్రబాబు.. గతంలో సీఎం గా ఉన్న సమయం లో జగన్ జమిలికి మద్దతు ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ సంకేతాలతో ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ వేగవంతం చేస్తోంది. ఈ సమయంలోనే వైసీపీ ముఖ్య నాయకత్వం 2027లోనే ఎన్నికలు ఖాయమని..తిరిగి జగన్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు - గెలుపు
జమిలి ఎన్నికల ప్రచారం వేళ వైసీపీ నేతల్లో ధీమా పెరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల ఇంఛార్జ్ గా భూమన ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎంపీ విజయ సాయిరెడ్డి జమిలి ఎన్నిక గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. 2027లోనే ఎన్నికలు వస్తాయని చెప్పారు. గతంలో కొన్ని వర్గాలు దూరం అయిన కారణంగా పార్టీ ఓడిపోయిందన్నారు. ఇప్పుడు అందరినీ కలుపుకొని పోతూ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కూటమి పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. తిరిగి జగన్ సీఎం కావటం ఖాయమని విజయ సాయిరెడ్డి ధీమాగా చెప్పుకొచ్చారు.

విజయం సాధిస్తాం
2027 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తామని సాయిరెడ్డి పేర్కొన్నారు. మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సైతం ఇదే అంశం ప్రస్తావించారు. నాడు కూటమి నేతలు చేసిన విష ప్రచారం కారణంగానే వైసీపీ ఓడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాల పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత భూమనదేనని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయం నుంచి అరాచకాలు రాష్ట్రంలో మొదలయ్యాయని సజ్జల ఆరోపించారు. ఒక మాఫియా రాజ్యం ఏలుతుందని విమర్శించారు.
పవన్ నోటికి ప్లాస్టర్
మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ పైన విరుచుకుపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ కాదని .. సూపర్ చీటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎం ప్రొడక్షన్ లో సీబీఎన్ ప్రభుత్వం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. తొక్కి నార తీస్తామన్న పవన్ ను ప్రజలే తొక్కి నార తీస్తారని రోజా ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ పేరుతో సీఎం కుమారుడు వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజుకో ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతున్నా పవన్ నోరు విప్పటం లేదన్నారు. చంద్రబాబు పాలనలో పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకున్నారని ఎద్దేవా చేసారు. విజయవాడ నగరం మునిగిపోతే బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications