తెలంగాణాలో టీడీపీ పోటీ వద్దన్నది మీరేనంట కదా పురందేశ్వరి గారూ: సాయిరెడ్డి సెటైర్లు!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలలో అధికార బి ఆర్ ఎస్, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఎవరి వ్యూహాలతో వారు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమే తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన వేళ, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయొద్దని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ అంటూ ప్రశ్నించారు. మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట కదా అని విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు.
ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! అంటూ ఆమెను ప్రశ్నించిన సాయిరెడ్డి బిజెపి గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారని ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతకుముందు కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు 'జాతీయ నేత'గా ఉండి 'జాతి నేత'గా ఎందుకు మారారు? అంటూ ఆమెను టార్గెట్ చేశారు.

మీ సొంతఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బిజెపి నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో MPTC, ZPTCలను ఎందుకు పోటీ పెట్టలేదు? అప్పటికి మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా! అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారు. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? అని ప్రశ్నించారు.
మీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? అంటూ విరుచుకుపడ్డారు. కొంపదీసి 'మా బావ కళ్లల్లో ఆనందం కోసం' అని నిజం చెబుతారా?. ఇదే కదా మీకు బిజెపి పట్ల ఉన్న చిత్తశుద్ధి! అంటూ పేర్కొన్నారు.వెనకటికి ఒకామె...ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట అంటూ పురందేశ్వరి పై సెటైర్లు వేశారు. మొత్తంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా టిడిపి కోసం, చంద్రబాబు కోసం, తమ సామాజిక వర్గం కోసం పురందేశ్వరి పనిచేస్తుందని పదే పదే విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications