టీడీపీ వ్యవస్థాపక ఉత్సవాల సంగతేమో కానీ.. వెంటపడి తరమకుండా చూసుకోండి బాబు: సాయిరెడ్డి సలహా
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వదిలి పెట్టడం లేదు. నిత్యం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ వారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో తెలుగు దేశం పార్టీపై విజయసాయిరెడ్డి మాటల దాడి కొనసాగిస్తున్నారు.

టీడీపీలో అంతర్గత పోరు... టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి
తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య పరస్పరం చోటుచేసుకున్న మాటల యుద్ధం తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలను బయటపెట్టాయి. పల్లె రఘునాథ్ రెడ్డి కి టికెట్ ఇవ్వొద్దని ఆయనకు టిక్కెట్ ఇస్తే టీడీపీ ఓటమి ఖాయం అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళ మధ్య కొనసాగుతున్న రచ్చ పై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

అసమర్థులు, చెంచాలకు తండ్రీకొడుకులు పెద్ద పీట వేస్తున్నారని రగిలిపోతున్నారు
టీడీపీ వ్యవస్థాపక ఉత్సవాల సంగతేమో కానీ తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి, అసమర్థులు, చెంచాలకు తండ్రీకొడుకులు పెద్ద పీట వేస్తున్నారని మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలు రగిలిపోతున్నారు అని పేర్కొన్నారు. వారు వెంటపడి తరమకుండా చూసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు విజయసాయిరెడ్డి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కులాల మధ్య అగ్గిరాజేస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలను కలుపుకుపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

21 ఏళ్ల టీడీపీ పాలనలో కులాల మధ్య అగ్గి రాజేశారు
దేశంలో ఎక్కడైనా జగన్ గారిలా పేదల గృహనిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వాలేవైనా ఉన్నాయేమో కనుక్కోండి బాబు గారూ అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి జగనన్న కాలనీల విషయంలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు . 72 వేల ఎకరాల్లో, 28 వేల కోట్లతో, 15.6 లక్షల నివాస గృహాలు, 17 వేల కాలనీలు వస్తున్నాయి అని పేర్కొన్నారు. 21 ఏళ్ల టీడీపీ పాలనలో కులాల మధ్య అగ్గి రాజేస్తే, సిఎం జగన్ అందరినీ కలుపుతున్నారు అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

11 రోజులు సభ జరిగితే చిడతలతో గోల తప్ప ఏ చర్చలో పాల్గొనలేదు
అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ వ్యవహరించిన తీరు పై మండిపడిన విజయసాయిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బాబు భజన చేసిన టీడీపి ఎమ్మెల్యేలు రేపు ఏం మొఖం పెట్టుకుని గ్రామాలకు వెళ్తారు? అంటూ ప్రశ్నించారు. 11 రోజులు సభ జరిగితే చిడతలతో గోల తప్ప ఏ చర్చలో పాల్గొనలేదు అని అసహనం వ్యక్తం చేశారు.అసలు సమావేశాలు జరిగాయా అని ప్రశ్నిస్తూ విలేకరులు నివ్వెరపోయేలా చేశారు చంద్రబాబు అని విజయసాయిరెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి చర్చలో టిడిపి పాల్గొనలేదని టిడిపి నేతల తీరును చంద్రబాబు తీరును తప్పుబట్టారు.

మీవాళ్లను అక్కడకు పంపించే దమ్ముందా చంద్రబాబు గారూ?
ఇక రాష్ట్రంలో జంగారెడ్డిగూడెం మరణాలను కల్తీ నాటుసారా మరణాలని తెలుగు దేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంలో ప్రతి మరణాన్ని నాటుసారా మరణంగా దుష్ప్రచారం చేయబోయి నవ్వులపాలయ్యారు టిడిపి నేతలని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నల్లమలలోని సార్లపల్లి పంచాయతీలో గుడంబా తాగి 30 మంది చెంచులు చనిపోయారని ఆరోపిస్తూ సర్పంచ్ రాజీనామా చేశారట. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసి మీవాళ్లను పంపించే దమ్ముందా చంద్రబాబు గారూ? అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు ఆరోపణలపై, నిజ నిర్ధారణ కమిటీ లపై సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications