సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి..: అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇవ్వాళ సీబీఐ న్యాయస్థానానికి హాజరయ్యారు. గతంలో జారీ చేసిన సమన్ల నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ అధికారులు 145 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి పేరు కూడా ఇందులో చేర్చారు. అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన ఇద్దరు కూడా ఇవ్వాళ విచారణకు హాజరయ్యారు. దస్తగిరి విచారణకు రాలేదు.

భాస్కర్ రెడ్డి ఇప్పటికే అరెస్టయిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ చంచల్ గూడ కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ ఉదయం భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్‌ను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించిన అనంతరం న్యాయస్థానం.. ఈ విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్ సింగ్‌పై ఫిర్యాదు చేస్తూ అవినాష్ రెడ్డి.. ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రామ్ సింగ్ హయాంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు మొత్తం పక్కదారి పట్టిందని పేర్కొన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న హైప్రొఫైల్ మర్డర్ కేసు ఇది. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications