చల్లబడ్డారా?: సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు వాయిదా
న్యూఢిల్లీ: స్పీకర్ మీరా కుమార్ అందుబాటులో లేకపోవడం వల్ల తమ రాజీనామాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ మంగళవారం చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో భేటీ అనంతరం సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు తమకు రాజీనామాలు చేయవద్దని సూచించారని, అయినప్పటికీ తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పార్టీ రాష్ట్ర నేతలుగా వారు రాజీనామాలు చేయవద్దని కోరడం సహజమే అన్నారు. తాము మాత్రం రాజీనామాలకే సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

తాము రాజీనామాలను ఆమోదింప చేసుకునేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లామని, ఆమె ఆకస్మిక పర్యటన కారణంగా తాము రాజీనామాలను ఆమోదింప చేసుకోలేక పోయామన్నారు. త్వరలో ఆమెను కలిసి రాజీనామాలను ఆమోదింప చేసుకుంటామని చెప్పారు. తాము రాజీనామాలు సమర్పించి యాభై రోజులు అయిందని వాటికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు.
తాము రాజీనామాలు చేయడం వల్లనే అధిష్టానం ఆంటోని కమిటీని వేసిందని, యాభై రోజులు తెలంగాణపై ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. స్పీకర్ అపాయింటుమెంట్ వాయిదా వెనుక కారణాలను ఆపాదించలేమని చెప్పారు. ముఖ్యమంత్రి, ఇతర నేతలు బుజ్జగిస్తే తాము వెనక్కి తగ్గలేదన్నారు. ఎంపి హర్ష కుమార్ ఏమైనా చెబితే ఆయననే అడగాలని, తమను కాదన్నారు. తాము చెప్పేది నమ్మేవాళ్లు నమ్ముతారని చెప్పారు.












Click it and Unblock the Notifications