పవన్ కల్యాణ్ కు ముద్రగడ సవాల్ - సిద్దమా..!!
ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ రేపటి నుంచి విశాఖ కేంద్రంగా తన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. వైసీపీ తరపున కాపు ఉద్యమ నేత ముద్రగడ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. తాజాగా తణుకులో కాపు సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ప్రస్తావించే అంశాలపై చర్చకు సిద్దమా అని సవాల్ చేసారు.
ముద్రగడ వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ లక్ష్యంగా ముద్రగడ ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్‌కు జనరల్ మేనేజర్‌గా పవన్ కల్యాణ్ ఉన్నారని, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కాపుల సంక్షేమం ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమన్నారు. జగన్ రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ పాలనపై తాను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావని ప్రశ్నించారు.

చర్చకు సిద్దం
తాను ఏ అంశం పైన అయినా బహిరంగ చర్చకు సిద్దమని..పవన్ ముందుకు వస్తారా అని సవాల్ చేసారు.పవన్ పేకాట క్లబ్‌లు నడిపే వారితో తనను తిట్టిస్తున్నారని ముద్రగడ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్‌లు పెడుతూ తనను అవమానిస్తున్నారన్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం జగన్ నాడే చెప్పారని గుర్తు చేసారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారని..అదే సమయంలో రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట అని ఎద్దేవా చేసారు.
జగన్ పథకాల అమలు
చంద్రబాబు.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తారు కానీ.. పవన్‌ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటారని ప్రశ్నించారు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతారని ముద్రగడ పేర్కొన్నారు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నారని... ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండని ముద్రగడ పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే తాను జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారని... దానికి మీకు అధికారం కావాలా అంటూ ప్రశ్నించారు. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా అని ఎద్దేవా చేసారు. వైయస్ఆర్‌షీపీ అభ్యర్థులను గెలిపించాలని ముద్రగడ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications