
ప్రధాని మోడీకి ముద్రగడ పద్మనాభం లేఖ.. ఆ ఆలోచన విరమించుకోండని విజ్ఞప్తి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ వేదికగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసి మరోమారు అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రంగంలోకి దిగారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలని ముద్రగడ మోడీకి లేఖ
ఇదిలా ఉంటే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మోదీకి కాపు ఉద్యమనేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని ఆయన ఈ లేఖ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని పేర్కొన్న ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరణ చేయడం తగదంటూ లేఖలో స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాల రద్దు మాదిరిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుకు డిమాండ్
రైతుల కోసం మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేసిన మాదిరిగానే భవిష్యత్తులో విశాఖ ప్రాంత ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెనక్కు తగ్గక పోతే ముందు ముందు వారికి అనేక సమస్యలు వస్తాయి అంటూ ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు అవసరం ఉంటుందన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు.

ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చింది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ
ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళన, వారి బాధలు చూసి రైతుల మెడకు చుట్టుకున్న మూడు వ్యవసాయ చట్టాలు పోవడానికి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా మీరు ప్రకటన ప్రకటన చూసి సంతోష పడ్డామని పేర్కొన్న ఆయన, అదే కోవలో విశాఖ ప్రాంతంలో ఆ రోజుల్లో ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా, ఎంతోమంది పదవులను తృణప్రాయంగా వదిలిన కారణంగా స్టీల్ ప్లాంట్ వచ్చిందని, విశాఖ ప్రాంత ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు అని, అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం కోసం తాము తీసుకున్న నిర్ణయం ఇక్కడ ప్రజలకు పిడుగు లాంటి వార్త ఆయన పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి దేశంలో ఇతర పరిశ్రమలకు లింక్ పెట్టి చూడొద్దు
ఎంతోమంది త్యాగ ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పలుచోట్ల స్థాపించిన పరిశ్రమలకు లింకు పెట్టడం న్యాయం కాదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రత్యేకంగా చూడడంతో పాటు దీనిని ఏ విధంగా సాధించుకున్నారో పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం.
అన్నింటితో పాటు జత చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని చూడకూడదని పేర్కొని, తమ ప్రాంత ప్రజల కోరికను తప్పనిసరిగా గౌరవించాలని ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను ప్రధాని నరేంద్ర మోడీ విరమించుకుంటారని భావిస్తున్నట్లుగా ముద్రగడ పద్మనాభం లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.