ముద్రగడకు చోటేదీ: ఉన్నది అదొక్క సీటే..!!
Mudragada Padmanabham: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా రెండు లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే.
ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

ఉమ్మడి తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొన్ని స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించారు వైఎస్ జగన్. అనకాపల్లి- మలసాల భరత్ కుమార్, పాయకరావుపేట (ఎస్సీ)- కంబాల జోగులు, పీ గన్నవరం (ఎస్సీ)- విప్పర్తి వేణుగోపాల్, ప్రత్తిపాడు- వరుపుల సుబ్బారావు, పిఠాపురం- వంగా గీత, జగ్గంపేట- తోట నరసింహం, రాజమండ్రి సిటీ- మార్గాని భరత్, రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పోలవరం (ఎస్టీ)- తెల్లం రాజ్యలక్ష్మిని నియమించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు పోగా అనకాపల్లి, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడుల్లో ఒక నియోజకవర్గాన్ని ముద్రగడ పద్మనాభం కుటుంబానికి కేటాయిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది.
ఈ మూడు చోట్లా కాపు సామాజిక వర్గ ఓటుబ్యాంకు బలంగా ఉండటమే కారణం. ఇప్పుడు అనూహ్యంగా ఈ మూడు స్థానాలకూ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఫలితంగా- ముద్రగడకు ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూడింటిని మినహాయించి మరో చోటి నుంచి పోటీ చేయడానికి ఆయన అంగీకరిస్తారా? అనే ప్రశ్న తల్తెతింది.
ఈ క్రమంలో తుని పేరు తెరమీదికి వచ్చింది. ముద్రగడ లేదా ఆయన కుటుంబానికి తుని నియోజకవర్గాన్ని కేటాయిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న స్థానం ఇది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన విజయం సాధించారు. దాడిశెట్టి రాజాను కాకినాడ లోక్‌సభ స్థానం లేదా రాజ్యసభకు పంపించి.. ఈ నియోజకవర్గం టికెట్‌ను ముద్రగడకు ఇస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications