చంద్రబాబు చెబితే గానీ పవన్ చేయడా?
Pawan Kalyan: జనసేన పార్టీలో చేరికపై కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపైనా స్పందించారాయన. జనసేనలో చేరడానికి ముద్రగడ సంసిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఇదివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సహా కొందరు పార్టీ సీనియర్ నేతలు సైతం ముద్రగడను కలిశారు. అవేవీ కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత జనసేనలో చేరికపై ఆసక్తి చూపారాయన.

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కొందరు కాపు ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు కిందటి నెలలోనే ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా సంప్రదింపులు జరిపారు. ఆ తరువాత ముద్రగడ.. జనసేనలో చేరడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ పద్మనాభాన్ని కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కాలం గడుస్తోన్నప్పటికీ.. ఇప్పటివరకు కూడా పవన్ కల్యాణ్.. ఆయనను కలవలేదు. మీడియా ముఖంగా కాకపోయినా కనీసం ఇతరత్రా రూపంలోనైనా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించిన సందర్భాలు రాలేదు.

మరోవంక- సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోండటం, తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య పొత్తు వ్యవహారాలు, సీట్ల పంపకాల్లో రెండు పార్టీలు తలమునకలు కావడం, ప్రచార కార్యక్రమాలు, జిల్లా పర్యటనలు, నియోజకవర్గాల సమీక్షల వంటి కారణాల వల్ల ముద్రగడ అంశం తెరమరుగైంది.
ఈ పరిణామాలపై ముద్రగడ స్పందించారు. తనను కలవడానికి పవన్ కల్యాణ్ వస్తే ఒక నమస్కారం పెడతాం.. లేకపోతే రెండు నమస్కారాలు పెడతాం అంటూ వ్యాఖ్యనించారు. తాము చెప్పాల్సింది చెప్పామని, తనను చేర్చుకోవాలా? లేదా? అనేది వారి నిర్ణయం మీదే ఆధారపడి ఉందని అన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే గానీ పవన్ కల్యాణ్ అడుగు ముందుకు వేయడా? అనే ప్రశ్నలు తల్తెతుతున్నాయి.












Click it and Unblock the Notifications