ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీ లింక్స్‌పై ఆరా
కడప: అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేష్ బదానీ సంబంధాలపై పోలీసులు అరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవల హర్యానాలోని హిస్సార్‌లో బదానీని అరెస్టు చేసి కడప జిల్లాకు తరలించిన విషయం తెలిసిందే. బదానీని కోర్టులో ప్రవేశపెట్టారు. కడప జిల్లా బద్వేలులో ఇటీవల అరెస్టయిన స్మగ్లర్ నర్సింహా రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బదానీని అరెస్టు చేసినట్లు మైదుకూరు డిఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు
బదానీకి ఎవరెవరితో సంబంధాలున్నాయో విచారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతామని చెప్పారు. కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా బద్వేల్, రైల్వే కోడూరు పోలీసు స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి బదానీపై పలు కేసులు ఉన్నాయి. జిల్లాలోని కొందరు రాజకీయ నాయకులతో ఆయనకు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బదానీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న కొంత మందిని పోలీసులు ఇప్పటికే అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని రాజంపేట డిఎస్పీ అరవిందబాబు, సిఐలు రాజేంద్ర ప్రసాద్, వెంకటప్ప, మరికొంత మంది సిబ్బంది అరెస్టు చేసి జిల్లాకు తీసుకుని వచ్చారు. అతనికి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి కోర్టులు హాజరు పరిచారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లపై కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు స్మగ్లర్లను వివిధ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications