ycp allegations high command street fight ys jagan mohan reddy వైసిపి ఆరోపణలు అభ్యంతరం నిరాశ హైకమాండ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వైసీపీలో మున్సిపల్ పదవులు రాజేసిన చిచ్చు .. రాష్ట్రవ్యాప్తంగా రగులుతున్న అసంతృప్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చినా, పార్టీలో మాత్రం అంతర్గత కలహాలకు ఆజ్యం పోశాయి. మున్సిపాలిటీలకు సంబంధించిన పదవుల కేటాయింపు అధికార వైసీపీలో చిచ్చు రాజేసింది. కొన్ని చోట్ల మునిసిపాలిటీల్లో పదవులపై పంచాయితీ బాహాటంగానే కొనసాగింది. డబ్బు ఇచ్చిన వారికే పదవులు ఇచ్చారంటూ తీవ్ర అసహనం తో ఉన్న వైసీపీ నేతల ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదు.
జగన్ ఇలాకాలో వైసీపీలో ముసలం .. జమ్మలమడుగు వైసీపీ కౌన్సిలర్ రాజీనామా, ఎమ్మెల్యేపై ఆరోపణలు

కష్టపడిన వారికి కాకుండా కొత్త వారికి పదవులు ఇచ్చారని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపాలక సంస్థల ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ అధికార వైసిపికి తిప్పలు తప్పడం లేదు. పదవుల విషయంలో పార్టీలో కొందరు కీలక నాయకులు తీవ్ర అసహనంతో ఉండడం అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పార్టీ ఆరంభం నుండి కష్ట పడిన వారికి పదవులు ఇవ్వకుండా, అసలే ఊహించని వారికి, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వారికి పదవులు కట్టబెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది నేతలు. ఇక అధిష్టానం మాత్రం సామాన్యులకు పదవులు కట్టబెట్టామని , సామాజిక న్యాయం పాటించామని చెప్పుకుంటుంది .

అన్ని మున్సిపాలిటీలు , కార్పోరేషన్ లలో కొత్త వారికే ఛాన్స్ .. అసహనంలో ఆశావహులు , సీనియర్లు
అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మేయర్ రేసులో మహాలక్ష్మి శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్ రెడ్డి రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇక డిప్యూటీ మేయర్ గా వసీం పేరు దాదాపుగా ఖరారైనట్లుగా ఆ పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. ఇక హిందూపురంలో చైర్మన్ గా మారుతి రెడ్డి పేరు, కళ్యాణదుర్గంలో వెంకటేష్ , ఇలా చాలామందికి పదవులు ఇస్తామని ఆశ చూపి అనూహ్యంగా పదవులను వేరొకరికి కట్టబెట్టారు. అనంత కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ గా ప్రచారంలో ఉన్న వసీం కు మేయర్ పదవిని కట్టబెట్టి, మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న వారికి కనీసం డిప్యూటీ మీరు కూడా ఇవ్వలేదు.

ఆందోళనలు , బాహాటంగా విమర్శలు ,సెల్ టవర్లు ఎక్కు నిరసనలతో అసంతృప్తి
ఇక విశాఖలో మేయర్ పదవి తనకు ఇస్తారని ఎంతో ఆశలు పెట్టుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్ కు మొండిచెయ్యిచ్చారు.ఇక కడప జమ్మలమడుగులోనూ కౌన్సిలర్ రాజీనామా చేసి స్థానిక ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేశారు .ఇలా రాష్ట్రవ్యాప్తంగా అధికార వైసీపీలో పదవులు ఇస్తామని చెప్పిన వారికి కాకుండా, అసలు పదవులను ఆశించిన రేసులో లేనివారికి పదవులు కట్టబెట్టడం ప్రధానంగా కనిపిస్తుంది. కొందరు ఆందోళన బాట పడితే, మరికొందరు బాహాటంగా ముఖ్య నాయకుల పై విరుచుకుపడ్డారు. ఇంకొందరు సీఎం జగన్ ను కలిసి తేల్చుకుంటామని తెగేసి చెప్పారు.

మంత్రులు , ముఖ్య నాయకులపై రగిలిపోతున్న నాయకులు .. ఆగ్రహ జ్వాలలు చల్లారేనా ?
మరి కొందరు ఆశావహుల అభిమానులు సెల్ టవర్లు ఎక్కి హంగామా చేశారు. మొత్తానికి ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు పెట్టిన పంచాయితీ వైసీపీలో అంతర్గత కలహాలకు, అసంతృప్తుల ఆగ్రహ జ్వాలలకు కారణంగా మారింది. స్థానిక మంత్రులపై తీవ్ర అసహనంతో ఉన్నారు పదవులు ఆశించి భంగపడిన నాయకులు .ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ వైసీపీలో వర్గ పోరు రచ్చ కొనసాగుతుండగా తాజాగా మున్సిపల్ ఎన్నికలు రేపిన చిచ్చు పార్టీని ఏ పరిస్థితి చేరుస్తుందో అన్న భావన వ్యక్తం అవుతుంది . ఈ ఆగ్రహజ్వాలలు ఎప్పటికి చల్లారతాయో మరి వేచిచూడాల్సిందే.