ఆయన్నొకసారి రమ్మని చెప్పండి: సీఎం జగన్
ఏపీ ఎన్నికల గంట అతి త్వరలోనే గణగణ మోగబోతోంది. వచ్చే నెలలో ఎన్నికల సంఘం నుంచి ప్రధానమైన వార్త రాబోతోందనే అంచనాలో అన్ని పార్టీలు ఉన్నాయి. 2019 ఎన్నికలకన్నా 2024 ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని అంచనా వేస్తున్నారు. అధికారం కోసం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం ఈసారి చావో? రేవో? అన్న రీతిలో తలపడబోతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడం అనేది వైసీపీకి ఎంత ముఖ్యమో.. అధికారం చేజిక్కించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి కూడా అంతకంటే ముఖ్యంగా మారింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపపై తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది. జగన్ కు బలంగా ఉన్న రాయలసీమలో పైచేయి సాధిస్తే అధికారం దక్కించుకోవడం సులభమనే అంచనాలో చంద్రబాబు ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మైదుకూరు నుంచి వైసీపీ తరఫున శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 వరుస ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కీలక నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పై ఈ రెండుసార్లు ఆయన గెలుపొందారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి 11,522 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలుపొందారు. వరుసగా మూడుసార్లు ఓడిపోవడం అనే సానుభూతి పనిచేస్తుందని, కచ్చితంగా ఈసారి గెలుస్తానని ఆర్థికంగా బలవంతుడైన పుట్టా భావిస్తున్నారు. అయితే వరుసగా మూడుసార్లకు పైగా ఓటమి పాలైన నేతలకు టికెట్లు లేవని చంద్రబాబు, లోకేష్ ప్రకటించడంతో ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఉంటుందా? లేదా? అనేవిషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావడం, వైసీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలు కలిసివస్తాయని వైసీపీ భావిస్తోంది. టీడీపీ తరఫున కొత్త అభ్యర్థి అయితే నియోజకవర్గంలో పోరు మాత్రం నువ్వా? నేనా? అనే రీతిలో పోరు సాగనుంది. సీనియర్ నేత డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డిని కూడా ఇరు పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఆయన మద్దతు ఉంటే తామే గెలుస్తామని వైసీపీ, టీడీపీ భావిస్తున్నాయి. స్థానిక వైసీపీ నాయకులు సీఎం జగన్ తో రవీంద్రరెడ్డి భేటీ జరపాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications