వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో మైలవరం ఎంపీపీగా ఉన్న సర్నాల తిరుపతిరావును పార్టీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మైలవరం బరిలో చాలామంది పేర్లు తెర మీదకు వచ్చినప్పటికీ..చివరికి సర్నాల తిరుపతిరావు వైపే జగన్ మొగ్గు చూపారు.
తనకు టికెట్ దక్కడంపై సర్నాల తిరుపతిరావు స్పందిస్తూ.. తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సీఎంఓ కార్యలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. జగన్‌ను కలిస్తే ఆయన మైలవరంలో జాగ్రత్తగా పని చేసుకోమని చెప్పడంతో తొలుత తనకు ఏమీ అర్థం కాలేదని సర్నాల తిరుపతిరావు చెప్పుకొచ్చారు. తరువాత మైలవరం టికెట్ నాకే ఇస్తున్నారని తెలియడంతో ఒకింత షాక్‌కు గురి అయ్యానని తెలిపారు.

నా బ్యాంకు అకౌంట్‌లో లక్ష రూపాయిలు కూడా లేవని.. పైగా టీడీపీ నుంచి దేవినేని ఉమ,వసంత కృష్ణ ప్రసాద్ వంటి హేమాహేమీలు పోటీ పడుతున్నారనే విషయాన్ని జగన్‌కు చెప్పగా..ఆయన వాళ్లు నీ కన్నా గొప్ప నాయకులు కాదని.. నీకు అంతగా భయం వేస్తే..తాడేపల్లికి వచ్చి నన్ను కలువు... నువ్వు పులివెందుల్లో పోటీ చేయ్.. నేను మైలవరంలో పోటీ చేస్తా..వ్యక్తులు మారతారేమో కానీ.. సీటు అయితే మారదని సీఎం జగన్ మైలవరం అభ్యర్థికి భరోసా ఇచ్చారు.
ఈ విషయాన్ని ఆయనే తాజాగా ఓ ఇంటర్య్వూలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీసీ కులానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వసంత కృష్టప్రసాద్ టీడీపీలో చేరి మైలవరం టికెట్ దక్కించుకున్నారు. మైలవరం టికెట్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమకు మొండిచేయి ఎదురైంది.












Click it and Unblock the Notifications