ఏకపక్షం, పార్టీలకు చెప్పాం: విభజనపై మైసురా
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఏకపక్షంగా సాగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు డాక్టర్ ఎంవి మైసురా రెడ్డి విమర్శించారు. ఏకపక్ష వైఖరిని జాతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో శాసనసభ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, రెండు రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానాలతోనే రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు.
రాజకీయ ప్రయోజనం కోసం రెండు ప్రాంతాలను విడదీయడం సరి కాదని ఆయన అన్నారు. ఆర్టికల్ 3ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని తాము జాతీయ పార్టీల నాయకులకు చెప్పామని, అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన చేయడం అప్రజాస్వామికమని జాతీయ పార్టీల నాయకులు కూడా చెబుతున్నారని మైసురా రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందనేది తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించిందని ఆయన చెప్పారు.
తమ వాదన విని కొంత మంది నాయకులు విస్మయం వ్యక్తం చేశారని, కాంగ్రెసు ఇంతగా దిగజారి వ్యవహరిస్తుందని తాము అనుకోలేదని కొందరు నేతలు తమతో అన్నారని ఆయన వివరించారు. మిగిలిన రాజకీయ నాయకులను కూడా తాము త్వరలో కలుస్తామని మైసురా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications