అహంకారానికి-ఆత్మగౌరవానికి మధ్య పోరు: పవన్ కళ్యాణ్ పోరాటం కొనసాగిస్తారన్న నాదెండ్ల మనోహర్
అమరావతి: ఏపీ సర్కారుపై జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందన్న ఆయన.. ఈ పోరాటంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

జనసేన ఆవిర్భావ సభకు జగన్ సర్కారు ఇబ్బందులు
మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే, మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ అనుకున్నాం.. కానీ, జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి వీల్లేని విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు.
స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు నాదెండ్ల. ముందు నిండు మనస్సుతో సభ నిర్వహించుకోవడానికి స్థలం ఇస్తామన్న రైతులు.. కాసేపటికే స్థలం ఇవ్వలేమని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారన్నారు. సభా వేదిక స్థలం వారం రోజుల్లో నాలుగు చోట్ల మారిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఒత్తిడి చేస్తుందో అర్ధం చేసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ అన్నారు.

రైతులను అవమానించారంటూ నాదెండ్ల ఫైర్
వైఎస్ జగన్ పాలనపై ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వంలో చాలా మంది అహంకారంతో పని చేస్తున్నారన్న నాదెండ్ల.. ప్రజలు నిండు మనస్సుతో 151 సీట్లు ఇస్తే.. పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. చాలా మంది పేదలకు సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. మరోవైపు, అమరావతిపై హైకోర్టు తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు మనోహర్. ఓ ఉద్యమ గళాన్ని వినిపించకుండా చేయాలనుకున్న ప్రభుత్వ పిచ్చి భ్రమను కోర్టు తన తీర్పుతో తొలగించిందన్నారు. ప్రభుత్వ వైఖరితో ఏపీ చాలా నష్టపోయిందన్నా నాదెండ్ల. ప్రభుత్వం రాజధాని రైతులను ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు.

పవన్ పోరాటం ఆగదు.. జగన్ క్షమాపణలు చెప్పాలంటూ నాదెండ్ల మనోహర్
ఏపీలో అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని నాదెండ్ల అన్నారు. ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడతారో మీరే చూస్తారు.. భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారోననేది స్పష్టం చేస్తారని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతోందో స్పష్టంగా చెబుతామన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications