సబ్సిడీ ధరతో టమాటా అమ్మకాలు - ప్రత్యేక కౌంటర్లు, నేటి నుంచే...!!
టమాటా ధరలు సామాన్యులకు భారంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ 100కి పైగా టమాటా ధర ఉంది. ఇతర రాష్ట్రాల్లో రూ 250కి చేరింది. ఏపీలో ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు టమాటా అందుబాటులోకి తెచ్చింది. ఇదే సమయంలో కేంద్రం రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రోజు నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ ధరలకే టమాటా అమ్మకాలు ప్రారంభిస్తోంది. కిలో రూ 70కి అమ్మకం జరపనుంది.
టమాటా రికార్డు ధర :టమాటా ధర గతల 20 రోజుల కాలంగా రికార్డు ధర పలుకుతోంది. టమాటాతో పాటుగా బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. చండీగఢ్‌లో ప్రజలు ఒక కిలో టమోటా కోసం 300 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిత్యావసరాలతో పాటుగా పెరిగిపోయిన కూరగాయల ధరలు సామన్యులకు భారంగా మారాయి. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో టమాటా అమ్మకాలను సబ్సిడీ ధరల పైన అమ్మకం కొనసాగుతోంది. కిలో రూ 50కి టమాటాను విక్రయిస్తున్నారు. అయితే, డిమాండ్ కు అనుగుణంగా కౌంటర్లు లేవని సాధారణ ప్రజలు చెబుతున్నారు.
సబ్సిడీ ధరలపై అమ్మకాలు:సబ్సిడీ టమాటా విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ సమయంలో కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ స్వయంగా ఢిల్లీ, నోయిడా, లక్నోతో సహా దేశంలోని అనేక నగరాల్లో కిలో రూ.80 చొప్పున టమోటాలను విక్రయించడం ప్రారంభించింది.
అయితే ఇప్పుడు ప్రభుత్వ స్టాల్స్‌లో కిలో రూ.80 కంటే తక్కువ ధరకే టమాటా కొనుగోలు చేయవచ్చు. జులై 20 నుంచి కిలో రూ.70 చొప్పున టమాట విక్రయిస్తామని సంస్థ ప్రకటించింది. తక్కువ ధరకు టమాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటాలను కొనుగోలు చేయనుంది.

నాఫెడ్ ప్రత్యేక కౌంటర్లు:కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఇప్పటి వరకు ఢిల్లీ లోని అనేక ప్రదేశాలలో మొబైల్ వ్యాన్‌ల ద్వారా కిలోకు రూ. 90 చొప్పున టొమాటోలను విక్రయించింది. దీని తర్వాత జూలై 16న నాఫెడ్ టమాటాలను కిలో రూ.10 తగ్గించి కిలో రూ.80కి విక్రయించడం ప్రారంభించింది.
ఇప్పటికే నాఫెడ్ లక్నో, వారణాసి, కాన్పూర్, పాట్నా, అగ్రా, ముజఫర్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో కిలో రూ.80 చొప్పున టమాట విక్రయిస్తోంది. ఈ రోజు నుంచి టమాటాలను కిలో రూ.70కి నాఫెడ్ విక్రయించనుంది. ఇందు కోసం ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించనుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో స్థానికంగా ప్రజలకు సమాచారం ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications