చిరంజీవిపై గరికపాటి నర్సింహారావు అసహనం: ఆపాటి అసూయ అంటూ నాగబాబు సెటైర్
హైదరాబాద్: దసరా వేడుకల సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, బీజేపీ నేత విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

చిరంజీవి హుందాగా.. కానీ, నాగబాబు మాత్రం
అయితే, ఓ సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నర్సింహారావు అసహనం వ్యక్తం చేశారు. అయితే, చిరంజీవి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. గరికపాటి తన పక్కనే చిరంజీవిని కూర్చోబెట్టుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా, చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు మాత్రం సోషల్ మీడియాలో గరికపాటికి కౌంటర్ ఇచ్చారు.

ఆపాటి అసూయ అంటూ గరికపాటిపై నాగబాబు సైటైర్లు
'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే..' అంటూ నాగబాబు తన ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన సోదరుడికి దక్కిన ఇమేజీని చూసి గరికపాటి అసూయపడ్డారనే అర్థం వచ్చేలా నాగబాబు సెటైరికల్ కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లో గరికపాటి పేరును నాగబాబు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గరికపాటిని విమర్శించడం సరికాదని నాగబాబుకు హితవు పలుకుతున్నారు.
చిరంజీవిపై గరికపాటి అసహనం.. కానీ, ఆ తర్వాత పక్కపక్కనే
అసలు విషయంలోకి వెళితే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి నర్సింహారావు మాట్లాడుతున్న సమయంలో.. పలువురు మహిళలు, యువతులు వచ్చి వేదికపైనే ఉన్న చిరంజీవితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో కొంత సందడి వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన ప్రసంగానికి విఘాతం కలగడంతో గరికపాటి కొంత అసహనానికి గురయ్యారు.
చిరంజీవి గారూ.. మీరో ఫొటో సెషన్ ఆపి ఇక్కడికి వస్తే.. తాను ప్రసంగం పూర్తి చేస్తానని.. లేదంటే ఇక్కడ్నుంచి వెళ్లిపోతానని హెచ్చరించారు. దీంతో అక్కడేవున్న పలువురు ఆయనకు సర్ది చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి రావడం.. ఆయనను గరికపాటి తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రసంగం పూర్తి చేయడంతో అక్కడంతా సాఫీగా సాగిపోయింది. అయితే, ఆ తర్వాత నాగబాబు.. గరికపాటిపై పరోక్షంగా చేసిన ట్వీట్ మాత్రం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications