మోడీతో గంటపాటు నాగ్ భేటీ: గుజరాత్‌లో ఏం చేశారు?
అహ్మదాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున సోమవారం సాయంత్రం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిశారు. మోడీని కలిసేందుకు నాగార్జున ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మోడీతో భేటీ అయ్యారు.
అహ్మదాబాదులోని పున్సారీ గ్రామాన్ని నాగార్జున సందర్శించారు. ఈ సందర్భంగా గుజరాత్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను నాగార్జున అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాదులో గల మమతా మందిర్‌ను సందర్శించారు.

కాగా, నాగార్జున రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. అయితే బిజెపికి మద్దతుగా ప్రచారం చేసే అవకాశముంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే బిజెపికే సాధ్యమని ఆయన ప్రజలకు చెప్పే అవకాశముందని అంటున్నారు.
నాగార్జున రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ఆయన సతీమణి అమల మాత్రం విజయవాడ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుని సంప్రదించిన అనంతరం నాగార్జున బిజెపి ప్రధాని అభ్యర్థితో భేటీ అయ్యారు. కాగా నాగార్జున, మోడీలు గంటసేపు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications