తెలంగాణను రెచ్చగొడతారా?, మనుషులేనా?: జగన్‌పై బాబు ఆవేశం, రాజమౌళికి ప్రశంస
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే.. తనను నీళ్ల దొంగ అంటున్నారని జగన్‌పై మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో నీటి సమస్యను వివరిస్తూ విపక్ష నేత జగన్ తీరును పరోక్షంగా తప్పుబట్టారు.

వీళ్లు మనషులేనా?.. తెలంగాణలో రెచ్చగొడతారా?
పోతిరెడ్డిపాడుకు నీళ్లిస్తుంటే.. తాను నీళ్లు దొంగిలిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ పత్రిక (సాక్షి)లో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా అక్కడ రాతలు రాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లను దొంగిలించడమేంటీ? ఎవరైనా అలా చేస్తారా? పులివెందుల, కడపకు నీళ్లిచ్చినా భరించలేరా? అంటే ఆవేశంగా మాట్లాడారు. ‘ఎంత నీచం... ఎంత దుర్మార్గం. వీళ్లు మనుషులేనా?' అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

రాక్షసులే..
కృష్ణా జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు దామాషా పద్దతిలో సమానంగా వాడుకుంటాయని తెలిపారు. రాష్ట్రంలో విపక్షం ప్రతి దానికి అడ్డుపడుతోందని, పట్టిసీమ, గండికోట, అమరావతి ఏ పని చేసినా అడ్డుపడ్డారని వివరించారు. ఇలాంటి వారిని ఏమనాలి? ఒక పద్దతి ప్రకారం ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.

మనూరికి నీళ్లిచ్చినా..
పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు రాయలసీమ ప్రాజెక్టుకు తీసుకెళుతుంటే అడ్డుపడితే ఎలాణ అని ప్రశ్నించారు. మనూరికి నీళ్లు ఇచ్చినా ఓర్చుకోలేని అసూయ మనుషులకుంటే ఎలా? అని మండిపడ్డారు. వీరి ప్రవర్తన చూస్తుంటే ఎక్కడికి తీసుకెళుతున్నారు వీళ్లు అనిపిస్తోందని చెప్పారు.

ఎప్పుడైనా మాదే గెలుపు
పట్టిసీమ చేపడితే డెల్టా మొత్తం ఎడారిలా మారిపోతుందని దుష్ప్రచారం చేశారని, రాజధాని వస్తుంటే అడ్డుకున్నారన్నారు. అలాగే.. పురుషోత్తపట్నం చేద్దామంటే కోర్టుకెళ్లారని విపక్షంపై చంద్రబాబు మండిపడ్డారు. రాయలసీమలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా... అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా ఏకపక్షంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అన్ని సెల్ఫ్ గోల్సే..
ప్రతిపక్షం దారుణంగా వ్యవహరించిందో చెప్పడానికి సదావర్తి భూములు ఒక పెద్ద ఉదాహరణ అన్నారు. అసలు ఆ భూములు మొదటి సారి జరిగిన వేలం పాటలో వారిని పాల్గొనొద్దని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వీరు చేసిన నిర్వాకం, దానికి తెచ్చిన ప్రచారంతో నిద్రపోతున్న తమిళనాడు వారిని కూడా లేపినట్లయిందని విమర్శించారు. విపక్షం ప్రతి విషయంలోనూ తప్పిదాలు చేస్తూ స్వయంకృతాపరాధాలు (సెల్ఫ్‌గోల్)కు పాల్పడుతోందని పేర్కొన్నారు.

రాజమౌళిపై ప్రశంసలు
అమరావతి రాజధాని నిర్మాణ ఆకృతులకు సంబంధించి దర్శకుడు రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒక గొప్ప సృజన శీల దర్శకులని, దాంతో సలహాలు అడిగామని, అందుకు అంగీకరించిన ఆయనకు కృతజ్ఞతలన్నారు. ఆయనతో పాటు జీఎంఆర్, జీవీకే ఇలా... చాలా మంది అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అడిగామని తెలిపారు. మీరు కూడా సలహాలు, సూచనలివ్వండి తీసుకుంటానని మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!