బిజెపిలోకి 'నమస్తే తెలంగాణ' చైర్మన్, ఎంపీపై జగన్ పార్టీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక చైర్మన్ సిఎల్ రాజం గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో కమలతీర్థం పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితోనే తాను బిజెపిలో చేరానని ఆయన చెప్పారు. నమస్తే తెలంగాణ ప్రజలందరి పత్రిక అని, తాను బిజెపిలో చేరడం మాత్రం వ్యక్తిగతమన్నారు.
కేంద్ర హోంమంత్రిని కలిసిన కిషన్, నాగం
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, మరో నేత నాగం జనార్ధన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలపై రాజ్‌నాథ్‌తో వారు చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఏపీలో కలపరాదని, తెలంగాణలోనే ఉంచాలని కోరారు.

తెలంగాణ కూడా ఎన్నో రంగాల్లో వెనుకబడి ఉందన,ి సీమాంధ్రతో సమానంగా తెలంగాణకు కూడా నిధులను కేటాయించాలని కోరారు. తమ విజ్ఞప్తికి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని కిషన్, నాగం అనంతరం తెలిపారు.
ఎస్‌పివై రెడ్డిపై చర్యకు ఫిర్యాదుకు రెడీ
పార్టీని ధిక్కరించిన నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డిపై చర్య తీసుకుని, అనర్హుడిగా ప్రకటించాలని లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విశ్వరూప్ చెప్పారు. సమీక్షా సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ పార్టీ నుండి బయటకు వెళ్లేవారు ఎవరూ లేరన్నారు.
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కెటిఆర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాదుకు రానున్న నేపథ్యంలో, కెటిఆర్ శాఖ అత్యంత కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రం నిర్దేశించిన గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలను సమకూరుస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications