Balakrishna : అంబటి నా వృత్తిని అవమానిస్తే-మీసం మెలేశానన్న బాలయ్య..
టీడీపీ ప్రెస్ మీట్ : ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)పై చర్చకు పట్టుబడి సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వం తమను ఎలా టార్గెట్ చేసిందో వివరించారు. 17 మందికి సమాధానం చెప్పలేక, 200 మంది మార్షల్స్ సాయంతో నచ్చినట్టు సభను నడిపించుకోవడానికే తమను బయటకు పంపారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై తాము అసెంబ్లీలో మాట్లాడకూడదా అని ప్రశ్నించారు.
ఇవాళేం జరిగిందంటే : చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని, శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్స్ తో టీడీపీ సభకు వెళ్లిందని, రాష్ట్ర శాసనసభ ఏర్పడినప్పటినుంచీ ఏనాడు సభలో జరగనివి నేడు జరిగాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈరోజు నిజంగా శాసనసభకు దుర్దినమే అన్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తి మీసంతిప్పి తొడగొడితే..దానికి తమ సభ్యులు బాలకృష్ణ స్పందించారన్నారు.

బాలయ్య రియాక్షన్ : చంద్రబాబు తప్పు చేశాడనడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) తెలిపారు. అసెంబ్లీలో జరిగింది తలుచుకుంటే చాలా బాధగా ఉందన్నారు.. పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో నియంత్రత్వధోరణి రాజ్యమేలుతోందన్నారు. తమ పైకి కొందరిని ఉసిగొల్పి, కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానించి, అతిగా స్పందించాకే తాను మీసం మెలేశానన్నారు.

అంబటి అవమానిస్తేనే : అంబటి రాంబాబు తనకు వేలు చూపించి మీసం మెలేసి తొడకొట్టాడని బాలయ్య తెలిపారు. నటన.. నా వృత్తి. దాన్ని అవమానించాడన్నారు. అతను అతిగా స్పందించాకే తాను మీసం తిప్పి తొడకొట్టానన్నారు. వీళ్లు భయపెడితే భయపడేవాళ్లం కామన్నారు. ఎంతదూరమైనా వెళ్తామని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. నేను హుందాగా ఉంటాను కాబట్టి.. ఏంచేసినా కామ్ గా ఉంటాననుకున్నారని, తాను స్పందించాక, వాళ్లకు మతిపోయినంత పనైందన్నారు. చంద్రబాబును జైలుకు పంపడంపై సినీ పరిశ్రమలో ఎవరి అభిప్రాయాలు వాళ్లవని, తనలా అందరూ ధైర్యంగా మాట్లాడలేరన్నారు.












Click it and Unblock the Notifications