రాయలసీమను ఆదుకునే ఆలోచనే లేదా?: జగన్ సర్కారుపై బాలకృష్ణ ఆగ్రహం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో మండిపడ్డారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. కృష్ణా జలాల పరిరక్షణే ధ్యేయంగా సాగిన ఈ సదస్సులో చర్చ జరిగింది.

సీమ కోసం ఢిల్లీకెళ్లైనా పోరాడతామంటూ బాలకృష్ణ
నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు-రాయలసీమ హక్కుల సాధన మీదే ప్రధానంగా చర్చంచారు. స్థానిక జేవీఎస్ ఫంక్షన హాల్‌లో ఈ మీటింగ్ నిర్వహించారు. సీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. రాయలసీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు. సీమ కోసం ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొచ్చారని తెలిపారు.

కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ బాలయ్య
హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు నందమూరి బాలకృష్ణ. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు నీరిచ్చే ఆలోచన జగన్ సర్కారుకు కూడా లేదని ధ్వజమెత్తారు. నీటి ప్రాజెక్టుకు, చెరువులకు, అనంత జిల్లాలోని అన్ని చెరువులకు వెంటనే నీరివ్వాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. రాయలసీమ పరిస్థితి చూసి హంద్రీనీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలె పెట్టారు. తెలుగు గంగ ద్వారా కొంత వరకు సస్యశ్యామలం చేశారన్నారు.

జగన్ సర్కారుకు బాలకృష్ణ సూచనలు
నీరు సమృద్ధిగా ఉన్నా హంద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వలేకపోయారు. 1400 చెరువులు ఉంటే కేవలం 130 చెరువులకు మాత్రమే నీరు ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి నీరు ఇవ్వాలని లేదు.. ఎవర్నీ సంప్రదించరు. కరవు మండలాలకు నీరు వచ్చేలా స్కీంలు పూర్తి చేయాలని బాలకృష్ణ.. జగన్ ప్రభుత్వానికి సూచించారు. రాయలసీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలన్నారు. గతంలో చేపట్టిన నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు. మన హక్కులను కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. అవసరమైతే సీమ నీటి ప్రయోజనాల కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని తీసుకొని రావాలి. రాయలసీమ ఒక్కప్పుడు రతనాల సీమ.. కానీ నిర్లక్ష్యంకి గురై ఈ పరిస్థితి వచ్చిందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.