నంద్యాల వ్యూహం మాది కాదు: ప్రశాంత్ కిశోర్, దివ్యారెడ్డి కీలక పాత్ర
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమి ప్రభావం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పైనే కాకుండా ప్రశాంత్ కిశోర్‌పై కూడా పడింది.
హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహం పనిచేయలేదనే మాట వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమి ప్రభావం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పైనే కాకుండా ప్రశాంత్ కిశోర్‌పై కూడా పడింది.
ప్రశాంత్ కిశోర్ వ్యూహరచనలో భాగంగానే జగన్ ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తోంది. ప్రశాంత్ కిశోర్ అంచనా తప్పు అని తేలిందని అంటున్నారు. ఈ చేదు అనుభవాన్ని ఆయన చవి చూడాల్సి వస్తోంది.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిపై వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి 6 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ప్రశాంత్ కిశోర్ జట్టు అంచనా వేసినట్లు చెబుతున్నారు.

వాదన ఇలా...
నంద్యాలలో ధన బలం, కండబలం గెలిచిందని ప్రశాంత్ కిశోర్ జట్టు సభ్యులు ఇప్పుడు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ విజయం సాధిస్తుందని, నంద్యాలలో కూడా అదే ధోరణి కొనసాగిందని చెబుతున్నారు. చంద్రబాబు తన వ్యూహరచనలోనూ పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ చాలా ముందు ఉన్నారని సర్దిచెబుతున్నారు.

దివ్యారెడ్డి ఇలా...
ప్రశాంత్ కిశోర్ జట్టుతో వైయస్ జగన్ సతీమణి భారతి సన్నిహిత బంధువు దివ్యారెడ్డి, ఎన్నారై రాజశేఖర రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. దివ్యారెడ్డి భారతికి వరసకు చెల్లెలు అవుతారు. సోషల్ మీడియా వ్యవహారాలు కూడా దివ్యారెడ్డి చూస్తారని చెబుతారు.

ఇదీ పనిచేసింది....
చంద్రబాబు నాయుడు వ్యూహం, శిల్పా మోహన్ రెడ్డి ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించడం వైసిపికి వ్యతిరేకమైందని అంటున్నారు. ఆ రెండు కారణాల వల్ల శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం స్తంభించిపోయిందని, ఇది ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకమైందని చెబుతున్నారు.

మాకేం సంబంధం లేదు..
నంద్యాల ఉప ఎన్నికతో తమకేమీ సంబంధం లేదని ప్రశాంత్ కిశోర్ జట్టు అంటున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో తాము పనిచేయబోమని, నంద్యాల ఉప ఎన్నికలో కూడా తమ పాత్ర ఏమీ లేదని అంటోంది. మొత్తం మీద, నంద్యాల ఉప ఎన్నిక ప్రభావం తమపై పడకుండా ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications