మూటలకు మాటలు కలిపారు: సుష్మాపై నన్నపనేని ఫైర్
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వారజ్‌లు చీకటి ఒప్పందం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వారి ఒప్పందంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపడాన్ని నన్నపనేని రాజకుమారి తప్పుపట్టారు. మూటలు తీసుకుని, మాటలు కలిపి సీమాంధ్రను ముంచుతారా అని ఆమె ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే గుండు గీయించుకుంటానన్న సుష్మా స్వరాజ్, ఇప్పుడు ఆమెతో ఎందుకు చేతులు కలిపారని అన్నారు. సుస్మా స్వరాజ్ ఏ విధంగా ప్రలోభాలకు గురయ్యారో భారతీయ జనతా పార్టీ విచారణ జరిపించాలని ఆమె కోరారు.

బిజెపి సవరణలు అంగీకారం: హరిబాబు
విభజన బిల్లుపై భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన సవరణలను కేంద్రం ప్రభుత్వం అంగీకరించిందని ఆ పార్టీ సీమాంధ్ర నేత హరిబాబు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఇరు ప్రాంతాలకు ప్రత్యేక హోదాను పది సంవత్సరాల పాటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రెండు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా పన్ను రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని హరిబాబు చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు హరిబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications