ఉచిత బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం, ఆధార్ అడగటంతో..!!
నారా భువనేశ్వరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత భువనేశ్వరి ఎక్కువగా కుప్పం లో పర్యటిస్తున్నారు. స్థానికులతో మమేకం అవుతున్నారు. ప్రజా దర్బార్ లు నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు. వారి సమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా.. తాజాగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్ పైన భువనేశ్వరి ప్రయాణం చేసారు. ఆ సమయంలో ఆసక్తి కర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి,
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఇందుకోసం ఆమె శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. ఆధార్ కార్డు చూపించాలని నారా భువనేశ్వరిని బస్ కండక్టర్ టికెట్ అడగడంతో కాసేపు సరదా సంభాషణ జరిగింది.

మహిళల కు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమని సీఎం చెప్పారంటూ భువనేశ్వరి అనడంతో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఆధార్ కార్డు చూపాలని కండక్టర్ అడిగింది. ఎట్టకేలకు ఆధార్ కార్డు చూపించి మరీ నారా భువనేశ్వరి ఇతర మహిళలతో కలిసి ప్రయాణించారు. బస్సులోని మహిళల తో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు.

కాగా , జలహారతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు. కృష్ణా జలాలను కుప్పం తీసుకొచ్చి తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించిన చంద్రబాబు కృషి అభినందనీయమని కొనియాడారు. కుప్పంలో 23 వేల కోట్ల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలు ఏర్పాటు చేశారని, అందులో మూడింటిని మహిళల అభివృద్ధికి కేటాయిచారని గుర్తుచేశారు.
దీనివల్ల ఈ ప్రాంతానికి కొత్త అవకాశాలు తెచ్చిందని అన్నారు. చంద్రబాబుకు కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. పరమసముద్రం కేజీబీవీలో పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పర్యటన ముగించుకుని వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఉన్న ఓ షాపు వద్ద టీ తాగి, బిస్కెట్ తిన్నారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న కొంతమందితో సరదాగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications