‘అన్న క్యాంటీన్ల’కు నారా భువనేశ్వరి భారీ విరాళం
అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రభుత్వానికి భారీ మొత్తం విరాళంగా అందించారు. ఈ మేరకు రూ. కోటి చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇచ్చారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లు కార్యక్రమం ఎంతో గొప్పదని భువనేశ్వరి కొనియాడారు. పేదవాడికి ఆహారం, ఇళ్లు, వస్త్రం అనేది ఎన్టీఆర్ నినాదమని ఆమె చెప్పారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతుగా విరాళం అందించినట్లు భువనేశ్వరి తెలిపారు. ఐదు రూపాయలకే కడుపు నింపడం అనేది గొప్ప కార్యక్రమమని భువనేశ్వరి అన్నారు. పేదలు, రోజు కూలీలు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

'అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామం. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నాను. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను' ట్విట్టర్(ఎక్స్) వేదికగా నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని భువనేశ్వరి ఆకాంక్షించారు. కాగా, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తొలి విడతగా 100 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ సర్కారు. తొలి విడతలో 17 జిల్లాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.












Click it and Unblock the Notifications